
- కమ్యూనిస్టులు రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలి
కోదాడ, వెలుగు: కమ్యూనిస్టులు సమాజంలో అంతర్భాగమని వారి పోరాట ఫలితంగానే అనేక సంస్కరణలు అనేక పథకాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయని రాష్ట్ర ప్రభుత్వానికి నిర్మాణాత్మక సహకారం అందించాలని రాష్ట్ర భారీ నీటిపారుదల, సివిల్ సప్లయ్స్ శాఖ మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి అన్నారు. మాజీ ఎంపీ, సీపీఐ జాతీయ నాయకుడు సురవరం సుధాకర్ రెడ్డి సంతాప సభ మంగళవారం సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు.
సురవరం సుధాకర్ రెడ్డి అత్యంత ఆదర్శనీయమమైన వ్యక్తి అన్నారు. నల్గొండ ఎంపీగా పనిచేసిన ఆయన ఆదర్శ కమ్యూనిస్టు అని, ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధికి కృషి చేశారని కొనియాడారు. మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. సురవరం సుధాకర్ రెడ్డి తన జీవితాన్ని కమ్యూనిస్టు పార్టీకి అంకితం చేశాడన్నారు. పేద, మధ్యతరగతి ప్రజల కోసం రైతాంగం వ్యవసాయ కూలీల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేశారన్నారు.
జిల్లా సీపీఐ కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించగా నల్గొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్సీలు నెల్లికంటి సత్యం, శంకర్ నాయక్, నాయకులు బొమ్మగాని ప్రభాకర్, మేకల శ్రీనివాసరావు, బద్దం కృష్ణారెడ్డి బత్తినేని హనుమంతరావు, ధనుంజయ నాయుడు, పుస్తెల సృజన, మండవ వెంకటేశ్వర్లు పుస్తెల నారాయణరెడ్డి, కంబాల శ్రీనివాస్ , అల్తాఫ్ హుస్సేన్, ఎస్.కె లతీఫ్ పాల్గొన్నారు.