
- కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి, వెలుగు : నిరుడు వరదల కారణంగా దెబ్బతిన్న రహదారులు, భవనాల మరమ్మతుల కోసం మంజూరైన నిధుల వినియోగానికి సంబంధించి యూసీలు సమర్పించాలని కలెక్టర్ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్మాట్లాడుతూ అధికారులు తమ పరిధిలోని రోడ్ల మరమ్మతు పనులకు సంబంధించిన ప్రతిపాదనలు త్వరగా ఇస్తే నిధులు మంజూరు చేస్తామన్నారు.
తద్వారా పనులు కూడా త్వరగా ప్రారంభించేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ వారంలోగా ప్రతిపాదనలు పంపించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అధికారులు పంపించే ప్రతిపాదనలకు సంబంధించి రిపేర్ వర్క్స్ యొక్క ఫొటోలు తప్పనిసరిగా సమర్పించాలన్నారు.
యాత్ర దానం వాల్ పోస్టర్స్ విడుదల..
సామాజిక బాధ్యతలో భాగంగా టీజీఆఎస్ ఆర్టీసీ 'యాత్ర దానం' అనే వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. కలెక్టరేట్లో యాత్ర దానం వాల్ పోస్టర్లను కలెక్టర్ విడుదల చేశారు. ఈ పథకం కింద వ్యక్తుల పుట్టిన రోజులు, వివాహ మహోత్సవాలు, ఇతర శుభకార్యాల్లో పేద విద్యార్థులకు విజ్ఞాన యాత్రలు, భక్తులు, నిరాశ్రయులైన వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలుకు బస్సులను బుక్ చేసి తీసుకెళ్లడమే ఈ యాత్ర ముఖ్యఉద్దేశమన్నారు.
గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై అవగాహన కల్పించాలి
వనపర్తి, వెలుగు : సమాజంలో నేరాలను అరికట్టడంలో టీచర్ల పాత్ర కీలకమని, విద్యార్థులకు గుడ్ టచ్.. బాడ్ టచ్ గురించి అవగాహన కల్పించాలని కలెక్టర్ఆదర్శ్ సురభి, ఎస్పీ రావుల గిరిధర్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్లో పోక్సో చట్టంపై టీచర్లకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో నేరాలను అరికట్టే బాధ్యత అందరిపై ఉందన్నారు.
ఉపాధ్యాయులు పిల్లలకు థర్డ్ పేరెంట్స్‌గా
వ్యవహరించాలని చెప్పారు. ఎక్కడైనా బాల్యవివాహాలు జరిగితే1098 నంబర్ కు కాల్ చేయాలని సూచించారు. 18 ఏండ్లు నిండకుండా వివాహం చేస్తే కలిగే నష్టాల గురించి వివరించాలన్నారు. కట్నం అనేది నేరమని, దీనిని అరికట్టాలని చెప్పారు. ఈ ఏడాది సైబర్ నేరాలను తగ్గించగలిగామని ఎస్పీ తెలిపారు. పోక్సో కేసులు కూడా తగ్గించేందుకు కృషి చేస్తామని చెప్పారు. సమావేశంలో డీఈవో అబ్దుల్ ఘని, డీసీపీవో రాంబాబు, చైల్డ్ చాప్టర్ ఎన్జీవో సంస్థ అధినేత జాకీర్ హుస్సేన్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. --------------