త్వరలోనే పాదయాత్ర మొదలుపెడతా: ఈటల

త్వరలోనే పాదయాత్ర మొదలుపెడతా: ఈటల

కరీంనగర్: ఆగిన చోటి నుంచి తన పాదయాత్ర త్వరలోనే మళ్లీ మొదలు పెడుతానని మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. అనారోగ్యంతో చికిత్స చేయించుకున్న ఆయన గురువారం హుజురాబాద్ లో కార్యకర్తలను కలిసి మాట్లాడారు. కాళ్ల కింద భూమి కదిలిపోయి, భవిష్యత్తు శూన్యం, అంధకారమే కనిపిస్తుండటంతో కేసీఆర్ కు ఏమీ తోచడం లేదని, ఈ విషయాలన్నీ ప్రజలకు సులభంగా అర్థమవుతున్నాయని మాజీ మంత్రి ఈటల పేర్కొన్నారు. ప్రలోభాలను తొక్కిపెట్టేలా కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రజలను చైతన్యవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. 
ఓట్లు కొనేవాళ్లు లీడర్లు అవుతారా..?
ఓట్లు కొనేవాళ్ల లీడర్లు అవుతారా.. ?  అని మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రశ్నించారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ 150 కోట్లు హుజురాబాద్ లో ఖర్చు చేశారని ఆయన పేర్కొన్నారు. ఓట్లను కొనుగోలు చేసేవాళ్లను బ్రోకర్లంటారు, పనిచేసి ప్రజల ప్రేమను పొందితేనే నాయకుడవుతారని ఆయన అభిప్రాయపడ్డారు. హుజూరాబాద్ లో  ఇంత మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి పనిచేస్తూ ఇన్ని వందల కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. 
ఒక్క హుజూరాబాద్ కాబట్టి ఓట్లు కొంటామంటన్నారు.. రేపు తెలంగాణ అంతటా కొనగలరా..?
ఇప్పుడు ఒక్క హుజూరాబాద్ ఉప ఎన్నిక కాబట్టే కోట్లు ఖర్చు చేసి ఓట్లను కొంటామంటున్నకేసీఆర్ రేపు తెలంగాణ అంతటా ఓట్లు కొనగలవా ? .. అయితే నీ దగ్గర ఎన్ని వేల కోట్లున్నాయి?  అని మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రశ్నించారు. 
ఎన్నికల కమిషన్ మీ ఆటలు సాగనీయదు 
ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక ఇంటికొకరు వచ్చి మనకోసం పనిచేస్తారనే విషయం గుర్తుంచుకోవాలని మాజీ మంత్రి ఈటల పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ ఎవరి ఆటలు సాగనివ్వదని ఆయన అన్నారు. ఏకపక్షంగా వ్యవహరించే వారిపై ఎన్నికల కమిషన్ వేటు వేస్తుందని ఆయన గుర్తు చేశారు.  
మానుకోటలో రాళ్లు వేసిన వ్యక్తికి ఎమ్మెల్సీ పదవా..?
మానుకోటలో మన మీద రాళ్లేసిన వ్యక్తికి కేసీఆర్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ విమర్శించారు. కేసీఆర్ దగ్గర ఇప్పుడు ఎమ్మెల్సీ అయిన వ్యక్తి ఉద్యమం సమయంలో మాకు చెప్పులు చూపించి రాళ్లతో దాడిచేసి చాలా మంది రక్తం కళ్లచూశాడని ఆయన ఆరోపించారు. రాళ్ల దాడి సంఘటనలో 19 మంది గాయపడ్డారని,   ఈ విషయం ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కూడా తెలుసు అన్నారు. ఉద్యమకారుల రక్తాన్ని కళ్ల చూసిన వ్యక్తికి ఎమ్మెల్సీ సీటు ఇచ్చాడంటే  కేసీఆర్ ఎవరిని గౌరవిస్తున్నట్లు ? అని ఆయన ప్రశ్నించారు. ఈటల రాజీనామా చేయడంవల్ల ఎన్నో ఫలితాలొచ్చాయని బీఎస్ రాములు ఆర్టికల్ రాశారు.. ఈటల గెలిస్తే మరిన్ని ఫలితాలు వస్తాయని ఆయన చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఇప్పుడు ఫామ్ హౌస్, ప్రగతి భవన్ వదిలిపెట్టి  దళితుల బాట పట్టారని, ఆయనదంతా ఆర్టీఫిషియల్ ప్రేమ అని మాజీ మంత్రి ఈటల ఎద్దేవా చేశారు.