Virat Kohli: కోహ్లీ ఫ్యాన్స్ దెబ్బకు దిగొచ్చిన ఐసీసీ.. పెద్ద మిస్టేక్‌నే గుర్తించారు

Virat Kohli: కోహ్లీ ఫ్యాన్స్ దెబ్బకు దిగొచ్చిన ఐసీసీ.. పెద్ద మిస్టేక్‌నే గుర్తించారు

అంతర్జాతీయ క్రికెట్ లో ప్రస్తుతం వన్డే ఫార్మాట్ మాత్రమే ఆడుతున్న విరాట్ కోహ్లీ అంచనాలకు మించి రాణిస్తున్నాడు. వయసుతో పాటు ఫామ్ ను కూడా పెంచుకుంటూ పోతున్నాడు. ఆస్ట్రేలియా టూర్ లో చివరి మ్యాచ్ లో హాఫ్ సెంచరీ కొట్టి టచ్ లోకి వచ్చిన కోహ్లీ.. ఆ తర్వాత సౌతాఫ్రికాపై మూడు వన్డేల సిరీస్ లో రెండు సెంచరీలు.. ఒక హాఫ్ సెంచరీ చేశాడు. ప్రస్తుతం కివీస్ తో జరుగుతున్న వన్డే సిరీస్ లోనూ విరాట్ అదరగొట్టేస్తున్నాడు. తొలి వన్డేలో 93 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. కోహ్లీ చివరి ఐదు వన్డేలు చూసుకుంటే వరుసగా 74*, 135, 102, 65*, 93 ఉన్నాయి.

ప్రతి మ్యాచ్ లో సెంచరీ లేదా హాఫ్ సెంచరీ చేయడం కింగ్ కు కామన్ అయిపోయింది. కోహ్లీ అసాధారణ ఫామ్ తో ఐసీసీ బుధవారం (జనవరి 14) ప్రకటించిన లేటెస్ట్ ర్యాంకింగ్స్ లో రోహిత్ శర్మను వెనక్కి నెట్టి నెంబర్ వన్ స్థానంలో నిలిచాడు. దాదాపు ఐదేళ్ల తర్వాత కోహ్లీ వన్డేల్లో నెంబర్ వన్ కు చేరుకోవడం విశేషం. చివరిసారిగా కోహ్లీ వన్డేల్లో జూలై 2021 లో నెంబర్ స్థానంలో ఉన్నాడు. ఇక కోహ్లీ వన్డే కెరీర్ లో తొలిసారి 2013లో తొలిసారి నెంబర్ ర్యాంక్ కు చేరుకున్నాడు. ప్రస్తుత వన్డే ర్యాంకింగ్స్ లో కోహ్లీ 785 రేటింగ్ పాయింట్స్ తో కోహ్లీ టాప్ లో ఉండగా.. న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ 784 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు.

ఇంత వరకు బాగానే ఉన్నా.. ఇదే సమయంలో ఐసీసీ చేసిన ఒక చిన్న మిస్టేక్ ను కోహ్లీ ఫ్యాన్స్ ఇట్టే పసిగట్టారు. కోహ్లీ తన కెరీర్‌లో నంబర్ 1 వన్డే బ్యాటర్‌గా ఎన్ని రోజులు కొనసాగాడో తెలిపే సోషల్ మీడియా గ్రాఫిక్‌ను ఐసీసీ తప్పుగా పోస్ట్ చేసింది. కోహ్లీ తన కెరీర్‌లో మెన్స్  నంబర్ 1 పురుషుల వన్డే బ్యాటర్ గా 825 రోజులు గడిపాడని.. వన్డేల్లో అగ్రస్థానంలో అత్యధిక రోజులు గడిపిన ప్లేయర్ల లిస్ట్ తెస్తే కోహ్లీ 10 వ స్థానంలో ఉన్నాడని.. ఐసీసీ తెలిపింది. అయితే ఇది స్పష్టమైన పొరపాటు అని ఫ్యాన్స్ గమనించారు. ఎందుకంటే కోహ్లీ వాస్తవానికి 1,547 రోజులు అగ్రస్థానంలో ఉన్నాడని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఐసీసీ చేసిన పొరపాటును వేలెత్తి చూపించారు. 

ఐసీసీ చేసిన తప్పును చాలా మంది నెటిజన్లు ఎత్తి చూపారు. కోహ్లీ ఫ్యాన్స్ మిస్టేక్ ను గుర్తించడంతో సోషల్ మీడియా పోస్ట్‌ను ఐసీసీ తొలగించింది. దీంతో కోహ్లీ 10వ స్థానం నుంచి మూడో స్థానానికి చేరుకున్నాడు. ఓవరాల్ గా వన్డేలో అత్యధిక రోజులు నెంబర్ వన్ గా ఉన్న ప్లేయర్ గా వెస్టిండీస్ దిగ్గజం సర్ వివియన్ రిచర్డ్స్ (2,306 రోజులు)  ఉన్నాడు. విండీస్ కే చెందిన మరో దిగ్గజ క్రికెటర్ బ్రియాన్ లారా (2,079 రోజులు) రెండో స్థానంలో ఉన్నాడు.