మహిళల వరల్డ్ కప్ లో ఇండియా, సౌతాఫ్రికా జట్ల మధ్య ఆదివారం (నవంబర్ 2) జరగాల్సిన మ్యాచ్ కు వరుణుడు అడ్డు పడ్డాడు. ముంబైలోని డాక్టర్ డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో మ్యాచ్ ప్రారంభానికి ముందు చిరు జల్లులు పడడంతో 2:30 గంటలకు పడాల్సిన టాస్ ఆలస్యమైంది. దీంతో టాస్ 3:00 గంటలకు వేయనున్నట్టు ప్రకటించారు. అయితే ఆ తర్వాత భారీ వర్షం కురవడంతో మ్యాచ్ కు బిగ్ బ్రేక్ తప్పేలా కనిపించడం లేదు. పరిస్థితులను చూస్తుంటే మ్యాచ్ ఈ రోజు జరిగేలా కనిపించడం లేదు.
మహిళల వరల్డ్ కప్ లో సెమీ ఫైనల్స్ తో పాటు ఫైనల్ మ్యాచ్‌లకు రిజర్వ్ డే కేటాయించారు. అందువల్ల మ్యాచ్ రోజు వర్షార్పణం అయినా.. ఆ మరుసటి రోజు మ్యాచ్ నిర్వహిస్తారు. ఆదివారం (నవంబర్ 2)న జరగబోయే ఫైనల్ జరగకపోతే సోమవారం (నవంబర్ 3) మ్యాచ్ ను నిర్వహిస్తారు. మ్యాచ్ జరిగి మధ్యలో ఆగిపోతే అక్కడ వరకు మ్యాచ్ ను వదిలేసి రిజర్వ్ డే రోజు మళ్ళీ మొదటి నుంచి మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ కుదించబడినట్టయితే తర్వాత రోజు ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడ నుంచి ప్రారంభమవుతుంది. ఒకవేళ రిజర్వ్ డే రోజు కూడా ఫలితం రాకపోతే ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు.
దశాబ్దాలుగా ఊరిస్తున్న ఐసీసీ ట్రోఫీని గెలిచేందుకు.. తమ కలను సాకారం చేసుకునేందుకు ఇండియా విమెన్స్ క్రికెట్ టీమ్ సిద్ధమైంది.
2005, 2017, 2020 (టీ20 కప్)లో ఫైనల్ గడపదాకా వచ్చి.. చివరి మెట్టుపై బోల్తా పడ్డారు. ప్రతిసారీ అభిమానుల గుండె నిరాశతో మూగబోయింది. దశాబ్దాలుగా ఊరిస్తున్న ఐసీసీ ట్రోఫీ ఇప్పుడు ఒక్క అడుగు దూరంలో ఉంది. అత్యంత బలమైన ఆస్ట్రేలియాను సెమీఫైనల్లోనే రఫ్పాడించిన హర్మన్‌ప్రీత్ కౌర్ సైన్యం.. క్రికెట్ ప్రపంచం మొత్తం ఎదురుచూస్తున్న మెగా ఫైనల్‌కు సిద్ధమైంది
