ఎఫ్‌సీఐ ఇచ్చిన గడువులోగా మిల్లింగ్‌ పూర్తి చేయాలి

ఎఫ్‌సీఐ ఇచ్చిన గడువులోగా మిల్లింగ్‌ పూర్తి చేయాలి

హైదరాబాద్‌, వెలుగు: ఎఫ్‌సీఐ ఇచ్చిన గడువులోగా మిల్లింగ్‌ పూర్తి చేయాలని సివిల్‌ సప్లయ్స్‌ మంత్రి గంగుల కమలాకర్‌  అధికారులను ఆదేశించారు. మిల్లింగ్​లో జాప్యం జరిగితే అధికారులే బాధ్యత వహించాలని ఆయన స్పష్టం చేశారు. సోమవారం ఎంసీఆర్‌ హెచ్‌ఆర్‌డీలో సివిల్‌ సప్లయ్స్‌ శాఖ ఉన్నతాధికారులు, జిల్లాల డీఎస్‌వోలు, డీఎంలతో మంత్రి సమీక్షించారు. రాష్ట్రంలో ఈ వానాకాలం భారీగా వరిసాగు పెరగడంతో  పంట సేకరణపై  అధికారులతో చర్చించారు. మంత్రి మాట్లాడుతూ సీఎంఆర్‌ గడువును ఎఫ్‌సీఐ పెంచినా మిల్లింగ్​ జాప్యం పై అసంతృప్తి వ్యక్తం చేశారు. త్వరలో స్వయంగా జిల్లాల్లో పర్యటిస్తానని, సీఎంఆర్ పై  నిర్లక్ష్యం వహిస్తే  ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. యాసంగిలో వానలకు తడిసిన ధాన్యం జిల్లాలవారీగా ఎంత ఉంది, ఈ వానాకాలం సేకరించాల్సిన ధాన్యం ఎంత అనే దానిపై  వారంలోగా నివేదికలు అందించాలని అధికారులను ఆదేశించారు.

ఇంటర్మీడియట్‌ స్టోరేజీలను గుర్తించాలి

మిల్లర్ల వద్ద ఇప్పటికే పెద్ద ఎత్తున దాదాపు 77 లక్షల టన్నుల ధాన్యం మిల్లింగ్‌ పూర్తి కాకుండా నిల్వ ఉందని, వానాకాలం ధాన్యం రానున్నందున వడ్లు నిల్వ చేయడానికి ఇంటర్మీడియట్‌ స్టోరేజీలను గుర్తించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. జిల్లా యంత్రాంగం మిల్లులను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ మిల్లింగ్ ప్రక్రియతో పాటు అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. రేషన్‌ బియ్యం పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకోవాలని, టాస్క్ ఫోర్స్ విభాగాన్ని పటిష్టం చేసుకోవాలన్నారు. పీడీఎస్ బియ్యం రీసేల్, రీసైక్లింగ్​ జరగరాదని హెచ్చరించారు. గురుకులాలు, హాస్టళ్లు, స్కూళ్లకు క్వాలిటీ బియ్యం అందించాలని, వాటిపై అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. అధికారులు నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేదిలేదన్నారు