ఢిల్లీలోని భారత్ మండపంలో ప్రారంభమైన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 మొదటి రోజు ప్రధానంగా రోడ్డు భద్రత అంశంపై దృష్టి సారించింది. సాంకేతికత కేవలం సౌకర్యం కోసం మాత్రమే కాదు, ప్రాణాలను కాపాడటానికి కూడా అనే నినాదంతో జరిగిన ఈ చర్చా కార్యక్రమాల్లో ఏఐ రోడ్డు ప్రమాదాలను ఎలా నివారించగలదనే అంశంపై నిపుణులు కీలక ప్రసంగాలు చేశారు.
కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ ప్రతినిధులు, ఐఐటీ పరిశోధకులు, అంతర్జాతీయ టెక్ దిగ్గజాలు పాల్గొన్న ఈ సెషన్‌లో రోడ్డు ప్రమాదాల విశ్లేషణకు సంబంధించి వినూత్న పరిష్కారాలను చర్చించారు. ముఖ్యంగా క్రాష్-ప్యాటర్న్ అనలిటిక్స్ ద్వారా గతంలో జరిగిన ప్రమాదాలను విశ్లేషించి.. ఏ ప్రాంతాల్లో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయో గుర్తించే విధానాన్ని ప్రదర్శించారు. ఏఐ ఆధారిత ప్రిడిక్టివ్ రిస్క్ మోడలింగ్ ద్వారా వాతావరణం, ట్రాఫిక్ రద్దీ, రోడ్ల పరిస్థితిని బట్టి ప్రమాదం జరిగే అవకాశం ఉన్న బ్లాక్ స్పాట్స్ ను ముందుగానే గుర్తించి హెచ్చరించే వ్యవస్థలపై ఫోకస్ పెట్టారు.
ALSO READ : తులం గోల్డ్ రూ.లక్ష కిందకి రాబోతోందా..?
ఈ సదస్సులో హైలైట్‌గా నిలిచిన మరో అంశం హైపర్‌లోకల్ సేఫ్టీ సొల్యూషన్స్ అని చెప్పుకోవాలి. ఇది స్థానిక భాషల్లో డ్రైవర్లకు హెచ్చరికలు జారీ చేయడం, డ్రైవర్ల ప్రవర్తనను గమనించి వారిని అలర్ట్ చేసే ఏఐ టూల్స్‌ను ప్రదర్శించారు. ఐఐటీ మద్రాస్, ఐఐటీ ఢిల్లీకి చెందిన నిపుణులు తాము రూపొందించిన స్కేలబుల్ ఏఐ మోడల్స్‌ను వివరించారు. ఇవి కేవలం నగరాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రమాదకరమైన మలుపుల వద్ద కూడా ఎలా పనిచేస్తాయో డెమోల ద్వారా చూపించారు.
కేవలం వాహనాలకే కాకుండా.. డ్రైవర్ల శిక్షణలో ఏఐ సిమ్యులేటర్లను ఉపయోగించడం ద్వారా మానవ తప్పిదాలను తగ్గించవచ్చని సమ్మిట్ అభిప్రాయపడింది. డేటా ఆధారిత విధానాల వల్ల అత్యవసర సమయాల్లో అంబులెన్స్ సేవలను వేగవంతం చేయడం, ట్రాఫిక్ సిగ్నల్స్‌ను ఏఐ ద్వారా నియంత్రించి ప్రయాణ సమయాన్ని తగ్గించడం వంటి అంశాలపై కూడా చర్చలు జరిగాయి. మొత్తం మీద మొదటి రోజు సదస్సు ఏఐని ప్రాణరక్షక కవచంగా మలచడంపై కీలక చర్చలు జరిగాయి.
