Wimbledon 2025: వింబుల్డన్ మహిళల సింగిల్స్ విజేత స్వియాటెక్.. ఫైనల్లో అనిసిమోవా ఘోర ఓటమి

Wimbledon 2025: వింబుల్డన్ మహిళల సింగిల్స్ విజేత స్వియాటెక్.. ఫైనల్లో అనిసిమోవా ఘోర ఓటమి

వింబుల్డన్ 2025 మహిళల సింగిల్స్ టైటిల్ ను పోలాండ్‌కు చెందిన ఇగా స్వియాటెక్ గెలుచుకుంది. ఏకపక్షంగా సాగిన ఫైనల్లో  అమండా అనిసిమోవాను 6-0, 6-0 తేడాతో ఓడించి తొలిసారి వింబుల్డన్ టైటిల్ ను కైవసం చేసుకుంది. స్వియాటెక్ కెరీర్ లో ఇది ఆరో గ్రాండ్ స్లామ్ మహిళలు సింగిల్స్ టైటిల్ కావడం విశేషం. మరోవైపు సెమీస్ లో సబలంకకు షాక్ ఇచ్చిన అనిసిమోవా ఫైనల్లో తేలిపోయింది. కనీస పోటీ ఇవ్వకుండానే స్వియాటెక్ ధాటికి చేతులెత్తేసింది  

స్వియాటెక్  విశ్వ రూపం:
 
గ్రాస్ కోర్ట్ పై పెద్దగా రికార్డ్ లేని స్వియాటెక్ వింబుల్డన్ ఫైనల్లో అంత ఈజీగా విజయం దక్కదని అందరూ భావించారు. అయితే నెక్స్ట్ లెవల్ టెన్నిస్ ఆడుతూ ప్రత్యర్థికి చుక్కలు చూపించింది. అనిసిమోవా సర్వీస్ ను మూడుసార్లు బ్రేక్ చేసి వింబుల్డన్ మహిళల సింగిల్స్ ఫైనల్‌లో మొదటి సెట్‌ను 6-0తో సునాయాసంగా కైవసం చేసుకుంది. రెండో సెట్ లోనూ  స్వియాటెక్ అదే జోరును కొనసాగించింది. తొలి గేమ్ లోనే  అనిసిమోవా సర్వీస్ బ్రేక్ చేసి ఆధిపత్యం చూపించింది. మూడో గేమ్ లో రెండో సారి సర్వీస్ బ్రేక్ చేసి 3-0 ఆధిక్యంలో నిలిచింది.

►ALSO READ | IND vs ENG 2025: రిచర్డ్స్‌ను దాటేసిన పంత్.. ఇంగ్లాండ్‌లో టీమిండియా వికెట్ కీపర్ రికార్డుల మోత

రెండో సెట్ నాలుగో గేమ్ లో అనిసిమోవా కొంచెం పోటీ ఇచ్చినా స్వియాటెక్ వెంటనే తేరుకొని 4-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఐదో గేమ్ లోనూ స్వియాటెక్ ప్రత్యర్థి సర్వీస్ బ్రేక్ చేసి 5-0 ఆధిక్యంలోకి వెళ్లి ఇదే ఊపులో ఆరో గేమ్ లో తన సర్వీస్ ను నిలబెట్టుకొని మ్యాచ్ తో పాటు టైటిల్ గెలుచుకుంది. ఈ మ్యాచ్ లో మొత్తం 5 డబుల్ ఫాల్ట్ లతో అనిసిమోవా మూల్యం చెల్లించుకుంది. ఈ మ్యాచ్ లో కనీసం ఒక్క గేమ్ కూడా గెలవకుండా అనిసిమోవా ఘోరంగా ఓడిపోయింది.