ఉగ్రవాద సంస్థలో చేరాలనుందన్న ఐఐటి స్టూడెంట్ అరెస్ట్

ఉగ్రవాద సంస్థలో చేరాలనుందన్న ఐఐటి స్టూడెంట్ అరెస్ట్

ఐఐటీ గౌహతి విద్యార్థి వివాదస్పద వ్యాఖ్యలు చేసి అరెస్ట్ అయ్యాడు. ఢిల్లీలోని ఓఖ్లాకు చెందిన తౌసీఫ్ అలీ ఫ్రక్వీ అస్సాం రాజధానిలోని ఐఐటీ గౌహతిలో చదువుతున్నాడు. ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌లో చేరాలని ఉందని శనివారం ఓ పోస్ట్ క్రియేట్ చేసి దాన్ని సోషల్ మీడియాలో పెట్టాడు. ఆ పోస్ట్ చేసినప్పటి నుంచి తౌసీఫ్ అలీ కనపడకుండా క్యాంపస్ నుంచి పారిపోయాడు. విద్యార్థి పెట్టిన పోస్ట్ ఇంటర్నెట్ లో వైరలై ఆ విషయం పోలీసులకు తెలిసింది. 

పోలీసులు రంగంలోకి దిగి తౌసీఫ్ అలీ కోసం గాలించారు. అదే రోజు అస్సాం కమ్రూప్ జిల్లాలోని హజోలో తౌసీఫ్ అలీ ఫ్రక్వీ గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అతడు చేసిన సోషల్‌ మీడియా పోస్టులు, ఈమెయిల్స్‌పై దర్యాప్తు చేస్తున్నట్లు అస్సాం స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు. ఆ విద్యార్థి హాస్టల్ గదిలో ఐఎస్‌ఐఎస్‌ను పోలిన నల్ల జెండా, ఇస్లామిక్ పత్రాలున్నట్లు పేర్కొన్నారు.

మరోవైపు బంగ్లాదేశ్‌ సరిహద్దు దాటి భారత్‌లోకి ప్రవేశించిన ఐఎస్‌ఐఎస్‌ చీఫ్‌ హరీస్‌ ఫరూఖీ అలియాస్ హరీష్ అజ్మల్ ఫరూఖీ, అతడి అనుచరుడు అనురాగ్ సింగ్ అలియాస్ రెహాన్‌ను అస్సాంలోని ధుబ్రి జిల్లాలో అరెస్టు చేశారు. ఇది జరిగిన నాలుగు రోజులకే ఐఐటీ విద్యార్థి సోషల్‌ మీడియా పోస్ట్‌, క్యాంపస్‌ నుంచి అతడు అదృశ్యం కావడం కలకలం రేపింది. తౌసీఫ్ అలీ ఫ్రక్వీని అన్ లాఫుల్ యాక్టివిటీ ప్రివెంషన్ యాక్ట్ (UAPA) కింద అరెస్ట్ చేశారు. ఎన్ఐఏ సంస్థతో విచారిణ చేపిస్తున్నారు.