బీజేపీలోకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్

బీజేపీలోకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్

లోక్ సభ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో పార్టీల్లోకి చేరికలు శరవేగంగా జరుగుతున్నాయి. భారత వాయుసేన మాజీ చీఫ్ ఆర్‌కేఎస్ భదౌరియా ఆదివారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీలో చేరారు. ఆయనతోపాటు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే సమక్షంలో తిరుపతి మాజీ ఎంపీ,  మాజీ ఐఏఎస్ వరప్రసాదరావు కూడా కాషాయ పార్టీ కండువా కప్పుకున్నారు. ఆర్​కేఎస్ భదౌరియాను బీజేపీలోకి చేరినందుకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే అభినందించారు. ప్రభుత్వ సేవలో సుదీర్ఘ చరిత్ర కలిగిన ఇద్దరు వ్యక్తులు బీజేపీలో చేరడం గొప్ప విషయమని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. 

భదౌరియా 2019 నుంచి 2021 వరకు ఎయిర్ ఫోర్స్ చీఫ్‌గా వ్యవహరించారు. ఫ్రాన్స్ నుంచి రాఫెల్ యుద్ధ విమానాలను కొనే డీల్‌ను ఖరారు చేయడంలో భదౌరియా కీలక పాత్ర పోషించారు. రాఫెల్ ఫైటర్ జెట్స్ టెక్నాలజీపై భారత ప్రభుత్వానికి గైడెన్స్ ఇచ్చింది ఆయనే. అంతకంటే ముందు వాయుసేనలో వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్‌గా సేవలందించారు. 26 విభిన్న రకాల యుద్ధ విమానాలను ఆయన నడిపారు. మొత్తం 36 సంవత్సరాల తన కెరీర్‌లో అతి విశిష్ట సేవా పతకం, వాయు సేన పతకం, పరమ విశిష్ట సేవా పతకాలతో సహా అనేక పతకాలు లభించాయి.