- బాధితురాలు, దోషి పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నారు
- అందుకే దోషికి శిక్షను రద్దు చేస్తున్నట్టు తీర్పు
న్యూఢిల్లీ: రేప్ కేసులో దోషిగా తేలిన వ్యక్తి.. బాధితురాలిని పెండ్లి చేసుకుని సంతోషంగా ఉన్నందున అతడికి కింది కోర్టు విధించిన శిక్షను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు వెలువరించింది. బాధితురాలు, దోషి ముందుగా ఒకరితో ఒకరు రిలేషన్ షిప్ లో ఉన్నారని.. కానీ అపార్థం చేసుకోవడం వల్ల బాధితురాలు అతడిపై రేప్ కేసు పెట్టినట్టుగా కోర్టు నిర్ధారణకు వచ్చింది. ఈ తీర్పు సందర్భంగా సుప్రీంకోర్టు జడ్జిలు జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ కీలక కామెంట్లు చేశారు.
గతంలో ఈ కేసు తమ ముందు విచారణకు వచ్చినప్పుడు బాధితురాలితో, దోషితో, వారిద్దరి పేరెంట్స్‌తో మాట్లాడామని.. వాళ్లిద్దరూ కలిసిపోతారని అప్పుడే తమ సిక్స్త్ సెన్స్ చెప్పిందని తెలిపారు. పోలీసులు చార్జ్ షీట్లో పేర్కొన్న వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్ లోని సాగర్ జిల్లాకు చెందిన బాధితురాలు, దోషి 2015లో సోషల్ మీడియాలో ఒకరికొకరు పరిచయమయ్యారు.
ఒకరినొకరు ఇష్టపడి రిలేషన్ షిప్లో కొనసాగారు. అయితే, పెళ్లి చేసుకునేందుకు అతడు నిరాకరించడంతో ఆమె 2021లో రేప్ కేసు పెట్టింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఐపీసీ సెక్షన్ 376, 376(2)(ఎన్) కింద కేసు నమోదు చేశారు. విచారణలో అతడిని దోషిగా తేల్చిన ట్రయల్ కోర్టు పదేండ్ల కఠిన కారాగార శిక్ష, రూ.55 వేల ఫైన్ విధిస్తూ తీర్పు చెప్పింది. ట్రయల్ కోర్టు తీర్పుపై హైకోర్టును ఆశ్రయించిన అతడు బెయిల్ కోసం అప్పీల్ చేసుకోగా తిరస్కరణకు గురైంది. దీంతో అతడు సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకున్నాడు.
మిస్ అండర్ స్టాండింగ్ వల్లే రేప్ కేసు..
ఈ కేసును గత మార్చిలో విచారించిన సుప్రీంకోర్టు జడ్జిలు జస్టిస్ వి.నాగరత్న, జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ.. బాధితురాలు, దోషి, వాళ్లిద్దరి తల్లిదండ్రులతో విడివిడిగా మాట్లాడారు. పెళ్లి చేసుకునేందుకు బాధితురాలు, దోషి అంగీకరించగా.. పెద్దలు కూడా ఓకే చెప్పారు. దీంతో అతడు పెళ్లి చేసుకోవడం కోసమని కోర్టు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేయగా, వారు జులైలో మ్యారేజ్ చేసుకున్నారు. కేసు ఇటీవల తిరిగి విచారణకు రాగా, జడ్జిలు ఈ మేరకు తుది తీర్పును వెలువరించారు.
ప్రస్తుతం బాధితురాలు, దోషి వివాహం చేసుకుని, సంతోషంగా జీవిస్తున్నారని కోర్టు నియమించిన అడ్వకేట్ ద్వారా తెలుసుకున్నారు. దీంతో పెళ్లిని వాయిదా వేస్తూ రావడంతో అభద్రతాభావానికి గురైనందునే బాధితురాలు రేప్ కేసు పెట్టినట్టుగా నిర్ధారణకు వచ్చారు. ‘‘ఆర్టికల్ 142 ప్రకారం మేం మా అధికారాలను వినియోగించి ఈ తీర్పు చెప్తున్నాం” అని జడ్జిలు పేర్కొన్నారు.
అలాగే సాగర్ జిల్లాలోని ఓ గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్న అతడిని.. ఈ కేసు కారణంగా ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. ఈ సస్పెన్షన్ ఎత్తివేసి, సస్పెన్షన్ విధించిన కాలానికి జీతాన్ని తిరిగి చెల్లించాలని అధికారులను సుప్రీంకోర్టు ఆదేశించింది.
