- కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీలో నిర్ణయం
- జనవరి 5 నుంచి ఎంజీఎన్ఆర్ఈజీఏ బచావో అభియాన్
- ప్రధాని మోదీ సర్కారుపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నరు
- రాష్ట్రాలు, పేదలపై కేంద్రం విధ్వంసకర దాడి
- మీడియా సమావేశంలో ఖర్గే, రాహుల్ గాంధీ ఫైర్
- ప్రధాని మోదీ సర్కారుపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నరు
- రాష్ట్రాలు, పేదలపై కేంద్రం విధ్వంసకర దాడి
- మీడియా సమావేశంలో ఖర్గే, రాహుల్ గాంధీ ఫైర్
న్యూఢిల్లీ, వెలుగు: గ్రామీణ పేద ప్రజల జీవనోపాధిలో కీలక పాత్ర పోషించిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం(ఎంజీఎన్ఆర్ఈజీఏ) రద్దుకు వ్యతిరేకంగా జనవరి 5 నుంచి దేశవ్యాప్త ఆందోళనకు కాంగ్రెస్ శ్రీకారం చుట్టింది. శనివారం ఢిల్లీలోని కాంగ్రెస్ హెడ్ ఆఫీస్ (ఇందిరా భవన్)లో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షత జరిగిన ఈ సమావేశంలో లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ(సీపీపీ) చైర్ పర్సన్ సోనియా గాంధీ, జనరల్ సెక్రటరీలు కేసీ వేణుగోపాల్, జైరాం రమేశ్, మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్, ఎంపీ శశిథరూర్, తెలంగాణ, కర్నాటక, హిమాచల్ ప్రదేశ్ సీఎంలు రేవంత్ రెడ్డి, సిద్ధ రామయ్య, సుఖ్విందర్ సింగ్ సుఖూ, సీడబ్ల్యూసీ సభ్యులు పాల్గొన్నారు.
తెలంగాణ నుంచి సీడబ్ల్యూసీ సభ్యులు మంత్రి దామోదర రాజనర్సింహా, సంపత్‌కుమార్, ఇతర సీనియర్లు హాజరయ్యారు. ఎంఎన్ఆర్ఈజీఏ పథకాన్ని ప్రధాన అంశంగా చేసుకుని దేశవ్యాప్తంగా భారీ ఉద్యమాన్ని చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ‘‘జనవరి 5న కాంగ్రెస్ నాయకత్వంలో ‘సేవ్ ఎంఎన్ఆర్ఈజీఏ’ ప్రచారాన్ని ప్రారంభించాలని, ఉపాధి హామీ చట్టాన్ని రక్షించేందుకు ఉద్యమించాలని ప్రతిజ్ఞ చేశారు.
ఎంఎన్ఆర్ఈజీఏ అనేది ఒక పథకం కాదు.. భారత రాజ్యాంగం ద్వారా హామీగా ఇచ్చిన పని హక్కు.. గ్రామీణ కార్మికుల గౌరవం, ఉపాధి, వేతనాలు సకాలంలో చెల్లింపు హక్కు కోసం ఐక్యంగా పోరాడాలని నిర్ణయం తీసుకున్నారు. ఎంఎన్ఆర్ఈజీఏ నుంచి గాంధీజీ పేరును తొలగించడంతోపాటు కార్మికుల హక్కులను దాతృత్వంగా మార్చడానికి జరిగే కుట్రను వ్యతిరేకించాలని ప్రతిజ్ఞ చేశారు. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్నచోట కేంద్రం సహకరించడంలేదని, నిధులు కేటాయించడం లేదన్న అంశాలపై చర్చించారు.
కేంద్రంపై ప్రజాగ్రహం: ఖర్గే
కేంద్ర ప్రభుత్వం ఎంజీఎన్ఆర్ఈజీఏను రద్దు చేయడంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, దాని పరిణామాలను ప్రధాని మోదీ ప్రభుత్వం ఎదుర్కోవాల్సి ఉంటుందని మీడియా సమావేశంలో కాంగ్రెస్ చీఫ్ ఖర్గే హెచ్చరించారు. దేశవ్యాప్తంగా ఎంజీఎన్ఆర్ఈజీఏ బచావో అభియాన్ ను పెద్ద ఎత్తున నిర్వహిస్తామని అన్నారు. వీబీ జీ రామ్ జీ చట్టంతో రాష్ట్రాలపై అదనపు ఆర్థిక భారం పడుతోందన్నారు. ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు.
పోరాటంతోనే 2015లో భూసేకరణ చట్ట సవరణలను, 2020లో అగ్రిచట్టాలను మోదీ సర్కారు వెనక్కి తీసుకుందన్నారు. ఇప్పుడు వీబీ జీ రామ్ జీ చట్టాన్ని కూడా కేంద్రం వెనక్కి తీసుకోక తప్పదన్నారు. ప్రజల ప్రజాస్వామ్య హక్కులను లాక్కునేందుకు బీజేపీ, ఎన్నికల సంఘం కలిసి ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్)’ పేరుతో కుట్ర చేస్తున్నాయని ఖర్గే ఆరోపించారు. ఈడీ, ఐటీ, సీబీఐలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో న్యాయ పోరాటం కొనసాగుతోందని తెలిపారు. కాంగ్రెస్ 'సంస్థా సృజన అభియాన్'ను కొనసాగిస్తామని తెలిపారు. 500 జిల్లాల్లో జిల్లా అధ్యక్షుల నియామకం పూర్తయిందని, బూత్ స్థాయి వరకూ పార్టీని బలోపేతం చేస్తున్నామని చెప్పారు. బంగ్లాదేశ్‌లో హిందూ మైనార్టీలపై జరుగుతున్న దాడులను ఖర్గే ఖండించారు. క్రిస్మస్ వేడుకలపై చేసిన దాడులు మత సామరస్యాన్ని, దేశ ప్రతిష్టను దెబ్బతీశాయని విమర్శించారు.
రాష్ట్రాలు, పేదలపై విధ్వంసకర దాడి: రాహుల్
మోదీ సర్కార్ రాష్ట్రాలు, పేద ప్రజలపై విధ్వంసకర దాడికి పాల్పడిందని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ప్రభుత్వ చర్యను కాంగ్రెస్ ప్రతిఘటిస్తుందన్నారు. 2006లో అప్పటి ఉమ్మడి ఏపీలో ప్రారంభమైన ఉపాధి హామీ స్కీం గ్రామీణ భారత ముఖచిత్రాన్ని మార్చిందన్నారు.
దళితులు, ఆదివాసీలు, మహిళలకు భరోసా ఇచ్చిందని, పేదరికం నుంచి బయటపడ్డ తరాన్ని సృష్టించిందని వివరించారు. పేదల కడుపు కొట్టిన మోదీ సర్కారుకు కార్పొరేట్ల లాభాలే ముఖ్యమన్నారు. ఎంజీఎన్ఆర్ఈజీఏ పథకాన్ని రద్దు చేయడమంటే గాంధీని అవమానించడమేనని ఫైర్ అయ్యారు.
ప్రధాని మోదీ తన మంత్రివర్గాన్ని కూడా సంప్రదించకుండానే ఈ నిర్ణయం తీసుకున్నారని, దేశ పాలన వన్ మ్యాన్ షోగా మారిందని విమర్శించారు. ఉద్యోగాలు ఇవ్వకుండా యువత భవిష్యత్తును నాశనం చేసిన మోదీ ప్రభుత్వం.. ఇప్పుడు గ్రామీణ ప్రజలకు కూడా ఉపాధి లేకుండా చేస్తోందన్నారు. ఎన్నో ఏళ్లుగా ప్రజలకు ఆర్థిక భరోసా ఇస్తూ, అన్నం పెట్టిన పథకాన్ని ఆపితే.. వారు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు.
రాజ్యాంగ రక్షణ కోసం ఉద్యమం..
దేశవ్యాపంగా పార్టీ బలోపేతంపై కూడా సీడబ్ల్యూసీలో ప్రత్యేకంగా చర్చించారు. కాంగ్రెస్ పార్టీ140 ఏండ్ల క్రితం ఏర్పాటైందని.. నాడు బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాటం చేసిందని సభ్యులు గుర్తు చేశారు. ప్రస్తుతం దేశంలో ప్రమాదపుటంచుల్లో ఉన్న రాజ్యాంగ పరిరక్షణ కోసం కూడా ఉద్యమం చేపట్టాలన్నారు.
దాదాపు రెండు గంటల పాటు సాగిన సమావేశంలో కేంద్ర విధానాలపై దేశ వ్యాప్తంగా చేపట్టాల్సిన ఆందోళనలు, అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. సమావేశం ప్రారంభానికి ముందు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు నివాళులర్పించారు. ఇటీవల మరణించిన కాంగ్రెస్ నేతలు శివరాజ్ పాటిల్, శ్రీప్రకాశ్ జైస్వాల్‌కు సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు.
