హైదరాబాద్, వెలుగు: సైదాబాద్‌లోని 2,700 గజాల భూమి శ్రీహనుమాన్ ఆలయానిదేనని హైకోర్టు తీర్పు చెప్పింది. ఈ మేరకు గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ సమర్థించింది. సివిల్ కోర్టు జారీ చేసిన డిక్రీని ఇంతవరకు సవాల్ చేయలేదని గుర్తు చేసింది. సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి ధర్మాసనం నిరాకరించింది. అప్పీల్ పిటిషన్ ను కొట్టివేసింది. ఆలయ, ప్రైవేట్ పార్టీల మధ్య కమిషనర్ రాజీ ఒప్పందం కుదిర్చి.. ఇరుపక్షాల మధ్య ఆస్తిని పంపిణీ చేయడాన్ని సవాల్ చేస్తూ శ్రీ హనుమాన్ ఆలయ అధ్యక్షుడు ఎన్.సుభాశ్ రెడ్డి 2009లో హైకోర్టులో సవాల్ చేశారు.
1990లో కమిషనర్ జారీ చేసిన రాజీ ప్రొసీడింగ్స్‌ను కొట్టివేశారు. 2,700 చదరపు గజాల భూమి ఆలయానిదేనని కోర్టు తీర్పు ఇచ్చాక దానిలో కమిషనర్ జోక్యం చేసుకోవడం చెల్లదని తేల్చారు. ఆలయ భూమిని రక్షించాలని టెంపుల్ ఈవోను ఆదేశించారు. అప్పీలు పిటిషన్లు కొట్టివేస్తూ జస్టిస్ మౌషుమి భట్టాచార్య, జస్టిస్ గాడి ప్రవీణ్‌కుమార్‌ధర్మాసనం తీర్పు వెలువరించింది.
