నిజామాబాద్ సిటీలో రెండు ఏటీఎంలు ధ్వంసం.. రూ.38 లక్షలు చోరీ

నిజామాబాద్ సిటీలో రెండు ఏటీఎంలు ధ్వంసం.. రూ.38 లక్షలు చోరీ

నిజామాబాద్, వెలుగు: రెండు ఏటీఎంలను దొంగలు గ్యాస్​ కట్టర్​తో ధ్వంసం చేసి రూ.38 లక్షలు ఎత్తుకెళ్లారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. నిజామాబాద్​ సిటీలోని ఆర్యానగర్​లో ఉప్పల మల్లయ్య పెట్రోల్​ బంక్​ పక్కనున్న డీబీఎం బ్యాంక్​ ఏటీఎంలోకి శనివారం తెల్లవారుజామున 3 గంటలకు దొంగలు ప్రవేశించారు. సీసీ కెమెరాలు పనిచేయకుండా స్ర్పే కొట్టారు. గ్యాస్​ కట్టర్​తో ఏటీఎం తెరిచి అందులో ఉన్న రూ.26 లక్షలు తీసుకున్నారు. తరువాత వర్ని చౌరస్తాకు చేరువలోని ఎస్​బీఐ ఏటీఎంలోకి వెళ్లారు.

అక్కడ కూడా గ్యాస్​ కట్టర్​తో ఏటీఎంను ధ్వంసం చేసి రూ.11.59 లక్షలు అపహరించారు. మొత్తంగా రూ.38 లక్షలతో ఉడాయించారు. రెండు చోట్ల అలారమ్స్ పనిచేయకపోవడంతో బ్యాంకర్లకు తెలియలేదు. గ్యాస్​ కట్టర్​ వల్ల ఆర్యనగర్​ ఏటీఎంలో మంటలు లేచాయి. దీంతో పక్కింటి వ్యక్తి విషయాన్ని గ్రహించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కామారెడ్డి ఇన్​చార్జి సీపీ రాజేశ్​చంద్ర చోరీ జరిగిన స్థలాలను పరిశీలించారు. దొంగలను పట్టుకోడానికి స్పెషల్​ టీంలను రంగంలోకి దింపారు.