- న్యూ ఇయర్ నేపథ్యంలో పెద్ద ఎత్తున సోదాలు
- డజన్లకొద్దీ ఆయుధాలు, లక్షల నగదు, అక్రమ మద్యం, చోరీ వస్తువులు సీజ్
న్యూ ఇయర్ నేపథ్యంలో ఢిల్లీలో నేరాలను అరికట్టేందుకు పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టారు. సౌత్, సౌత్ ఈస్ట్ జిల్లాల్లో శుక్రవారం రాత్రి నుంచి 24 గంటలపాటు నిర్వహించిన ‘ఆపరేషన్ అఘాత్ 3.0’లో భాగంగా 660 మందిని అరెస్ట్ చేశారు.
న్యూఢిల్లీ: న్యూ ఇయర్ నేపథ్యంలో ఢిల్లీలో నేరాలను అరికట్టేందుకు పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టారు. సౌత్, సౌత్ ఈస్ట్ జిల్లాల్లో శుక్రవారం రాత్రి నుంచి 24 గంటలపాటు నిర్వహించిన ‘ఆపరేషన్ ఆఘాత్ 3.0’లో భాగంగా 660 మందిని అరెస్ట్ చేశారు. డజన్ల కొద్దీ ఆయుధాలు, లక్షల రూపాయల నగదు, అక్రమ మద్యం, డ్రగ్స్, దొంగిలించిన వస్తువులను స్వాధీనం చేసుకొని, సీజ్ చేశారు.
ఈ డ్రైవ్‌లో భాగంగా సుమారు 2,800 మందిని పోలీసులు విచారించారు. సౌత్ ఈస్ట్ జిల్లాలో అత్యధికంగా 285 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరందరిపై ఆర్మ్స్ యాక్ట్, ఎక్సైజ్ యాక్ట్, ఎన్డీపీఎస్ (ఎన్డీపీఎస్), గ్యాంబ్లింగ్ చట్టాల కింద కేసులు నమోదు చేశారు. సుమారు 155 మంది పాత నేరస్థులు, 10 మంది ఆస్తి సంబంధిత నేరాలకు పాల్పడే వారిని అదుపులోకి తీసుకున్నారు. అదనంగా 850 మందిని ముందస్తుగా నిర్భందించారు.
న్యూ ఇయర్ వేడుకలు ప్రశాంతంగా జరిగేలా..
వీధి రౌడీలు, నేరస్థులతో సంబంధం ఉన్న అనుమానితులే లక్ష్యంగా పోలీసులు తనిఖీలు చేశారు. కొత్త సంవత్సర వేడుకల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా దాడులు చేశారు. పండుగ సమయంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన 350 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
అలాగే వాహన దొంగతనాలను అరికట్టేందుకు ఐదుగురు ‘ఆటో లిఫ్టర్ల’ను కూడా పట్టుకున్నారు. ఈ దాడుల్లో భాగంగా 24 నాటు తుపాకులు, 44 కత్తులు స్వాధీనం చేసుకున్నారు. 22,500 క్వార్టర్ల అక్రమ మద్యం, 10 కేజీల గంజాయిని పట్టుకున్నారు. 231 బైక్‌లు, ఒక ఫోర్ వీలర్‌ను సీజ్ చేశారు. 350 దొంగిలించి మొబైల్ ఫోన్లు రికవరీ చేశారు. గ్యాంబ్లర్స్ నుంచి రూ. 2.3 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.
