- భారీగా పెరిగిన డ్రంకెన్ డ్రైవ్ కేసులు
- ఆత్మహత్య చేసుకున్న 289 మందిలో 236 మంది పురుషులే..
- పెరిగిన ప్రాపర్టీ, సైబర్ నేరాలు
- 51 కిడ్నాప్ కేసుల్లో 44 ప్రేమ వ్యవహారంతో జరిగినవే..
- కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో యాన్యువల్క్రైం రిపోర్ట్
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో రోడ్డెక్కిన వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే పోలీసులు చలానా రూపంలో భారీ మొత్తంలో ఫైన్ వేస్తున్నారు. నిరుటితో పోలిస్తే ఈ మొత్తం డబుల్ అయింది. 2024లో 3.57 లక్షల ఈ–చలానా కేసుల్లో రూ.8.92 కోట్ల ఫైన్ విధిస్తే ఈ ఏడాది 3.83 లక్షల కేసుల్లో రూ.18.21 కోట్ల జరిమానా వేశారు. గతేడాది 6,722 డ్రంకెన్‌డ్రైవ్ కేసులు నమోదైతే ఈ ఏడాది 9,294 ఫైల్ అయ్యాయి. సుమారు 28 శాతం కేసులు పెరిగినట్లు సీపీ గౌస్ఆలం తెలిపారు.
లేజర్ గన్ కేసులు నిరుడు 9,157, ఈ ఏడాది 17,491 నమోదైనట్లు చెప్పారు. శనివారం కరీంనగర్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లోని అస్త్ర కన్వెన్షన్ హాల్ లో అడిషనల్ డీసీపీలు వెంకటరమణ, భీంరావు, ఏసీపీలు వెంకటస్వామి, మాధవి, విజయ్ కుమార్ తో కలిసి మీడియా సమావేశంలో యాన్యువల్ క్రైం రిపోర్ట్–2025ను వెల్లడించారు. 2,531 కేసులకు గానూ 781 కేసుల్లో నేరస్తులకు శిక్ష పడిందని తెలిపారు. గతేడాదితో పోలిస్తే కన్విక్షన్ రేటు 7 శాతం పెరిగినట్లు పేర్కొన్నారు.
పెరిగిన దొంగతనాలు
కరీంనగర్ జిల్లాలో గతంతో పోలిస్తే ప్రాపర్టీ క్రైం పెరిగింది. నిరుడు 5 రాబరీలు జరిగితే ఈ ఏడాది 10 జరిగాయి. గతేడాది చైన్ స్నాచింగ్ ఘటనలు 9 జరిగితే ఈ ఏడాది 14కు పెరిగాయి. నిరుడు 144 ఇండ్లలో చోరీ జరిగితే ఈ ఏడాది ఆ సంఖ్య 162 కు చేరింది. నిరుడు మొత్తం 483 చోరీ సంబంధిత ఘటనలు జరిగితే ఈసారి 501కు పెరిగాయి. గతేడాది రూ.2.92 కోట్ల విలువైన ప్రాపర్టీ కేసులు నమోదైతే రూ.75.89 లక్షల ప్రాపర్టీ రికవరీ చేయగా.. ఈ ఏడాది రూ.4.11 కోట్ల విలువైన కేసుల్లో రూ.2.04 కోట్ల విలువైన ప్రాపర్టీని రికవరీ చేశారు. యూపీఐ సంబంధిత ఫ్రాడ్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్ కార్డు, ఈ–వ్యాలెట్తదితర నేరాలపై మొత్తం 2,437 ఫిర్యాదులు రాగా 280 కేసులు నమోదయ్యాయి.
289 మంది సూసైడ్
జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న వారిలో మగవాళ్లే ఎక్కువ. గత మూడేళ్లుగా ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. 2023లో 297 మంది ఆత్మహత్య చేసుకుంటే వారిలో 237 మంది పురుషులు, 56 మంది మహిళలు ఉన్నారు. నిరుడు సూసైడ్ చేసుకున్న 291 మందిలో 231 మంది పురుషులు, 60 మంది మహిళలు. ఈ ఏడాది 289 మంది ఆత్మహత్య చేసుకుంటే వారిలో 236 మంది పురుషులు, 51 మంది మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. అయితే వీరిలో సగం మంది అనారోగ్య కారణాలతో సూసైడ్ చేసుకోగా.. మరికొందరు పేదరికం, ఇంకొందరు కుటుంబ కలహాలు, ప్రేమ వ్యవహారాలతో ఆత్మహత్య చేసుకున్నట్లు సీపీ తెలిపారు.
51 కిడ్నాప్, 38 రేప్ కేసులు
ఈ ఏడాది 51 కిడ్నాప్ కేసులు నమోదు కాగా.. అన్నింటినీ పోలీసులు ట్రేస్ చేశారు. వీటిలో 4 కేసులు ప్రతీకారం కోసం, 3 ఫైనాన్షియల్ ఇష్యూస్ తో జరగగా, 44 ప్రేమ వ్యవహారంతో జరిగినట్లు గుర్తించారు. మొత్తం 38 రేప్ కేసులు నమోదయ్యాయి. అన్ని చోట్లా బాధితులకు తెలిసిన వాళ్లే వారిపై అఘాయిత్యాలకు పాల్పడ్డారు. మహిళలపై వేధింపులకు సంబంధించి 442 కేసులు నమోదయ్యాయి. జిల్లాలో నిరుడు ఒక మహిళ, ఈ ఏడాది ఏడుగురు మహిళలు హత్యకు గురయ్యారు. వరకట్న వేధింపుల కారణంగా నిరుడు ఐదుగురు, ఈ ఏడాది 8 మంది సూసైడ్చేసుకున్నారు. అమ్మాయిలను మోసం చేసి లైంగికంగా వాడుకున్న ఘటనలకు సంబంధించి 21 కేసులు నమోదయ్యాయి.
