
- కర్నాటకలోనూ యూరియాకు డిమాండ్
- బినామీ రైతుల పేర్లతో కర్నాటక రైతులకు యూరియా ఇస్తున్న ప్రైవేట్ వ్యాపారులు
మహబూబ్‌నగర్/మక్తల్, వెలుగు: యూరియాకు ఫుల్ డిమాండ్ ఏర్పడగా అక్రమ రవాణాకు ఆఫీసర్లు చెక్ పెడుతున్నారు. రాష్ట్రంలో డిమాండ్ మేరకు సప్లై లేక ఇబ్బందులు ఉండగా.. కర్నాటకలో కొందరు ఫర్టిలైజర్ వ్యాపారులు యూరియాను రైతులకు అమ్మేందుకు కొర్రీలు పెడుతున్నారు. దీంతో ఆ ప్రాంత రైతులు సరిహద్దులో ఉన్న తెలంగాణకు వస్తున్నారు. ఇక్కడ కొందరు వ్యాపారుల సహకారంతో దొంగచాటుగా యూరియాను కర్ణాటకకు తరలిస్తున్నారు.
రూ.300 లకు రూ.5 వేల ఖర్చు
తెలంగాణలో యూరియా బస్తా ఒకటి రూ.255.60 ఉండగా.. కర్నాటకలో బస్తా రూ.300. ఇక్కడి మాదిరిగానే అక్కడా కొంత కొరత ఉంది. దీనిని ఆసరా చేసుకున్న అక్కడి ఫర్టిలైజర్ వ్యాపారులు బస్తా యూరియా కావాలంటే.. మూడు బస్తాల డీఏపీ లేదా కాంప్లెక్స్ ఎరువులు కొనాలని అక్కడి రైతులకు మెలిక పెడుతున్నారు. ఒక డీఏపీ సంచి రూ.1,800 ఉండగా.. మూడు సంచులు కొనాలంటే రూ.5,400తో పాటు బస్తా యూరియాకు రూ.300 కలిపి మొత్తం రూ.5,070ఖర్చు అవుతోంది.
దీంతో ఆ ప్రాంత రైతులు తెలంగాణకు చెందిన యూరియాను అక్రమంగా కొంటున్నారు. కొందరు మీడియేటర్ల ద్వారా ఇక్కడి ప్రైవేట్ఫర్టిలైజర్ దుకాణాల వ్యాపారులతో మాట్లాడుకొని యూరియాను తరలించుకుపోతున్నారు. ఇందుకు గాను బస్తాకు రూ.800 నుంచి రూ.వెయ్యి చొప్పున చెల్లిస్తున్నారు. వాస్తవానికి ఒక సంచి యూరియా అమ్మాలన్నా తెలంగాణ రైతుకు చెందిన పేరు, ఆధార్ నంబరు, పట్టాదారు పాస్ పుస్తకం నంబరును ఆన్లైన్లో ఎంట్రీ చేయాలి. ఆ తర్వాత ఆధార్ అనుసంధానంగా ఉండే ఫోన్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది.
ఆ ఓటీపీ ఆన్లైన్లో ఎంట్రీ చేస్తేనే ఎకరాలను బట్టి యూరియా బస్తాలను అందిస్తారు. కానీ ఇక్కడే ప్రైవేట్వ్యాపారులు అక్రమాలకు పాల్పడుతున్నారు. తమ వద్ద రెగ్యులర్‌గా పిండి సంచులు, మందులు, ఎరువులు, విత్తనాలు, పంటల పెట్టుబడుల కోసం అప్పులు తీసుకునే రైతుల పేర్ల మీద.. కర్నాటక రైతులకు యూరియా బస్తాలను అమ్ముతున్నారు.
నారాయణపేట, గద్వాల బార్డర్లలో తనిఖీలు..
తెలంగాణ యూరియా కర్నాటకకు తరలి పోతుండటంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నారాయణపేట, జోగుళాంబ గద్వాల జిల్లాల్లోని సరిహద్దు చెక్ పోస్టుల వద్ద నిఘా పెంచారు. తెలంగాణ నుంచి కర్నాటక వైపు వెళ్తున్న ఆటోలు, జీపులు, మినీ డీసీఎంలు, ఇతర వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో రెండు రోజుల కిందట గట్టు మండలం బల్గెర వద్ద ఉన్న చెక్‌పోస్టు దగ్గర తనిఖీలు చేస్తుండగా.. మినీ డీసీఎంలో 76 బస్తాల యూరియాను కర్నాటకకు తరలిస్తుండగా పట్టుకున్నారు. ఈ సంచులు ఎక్కడి నుంచి తీసుకొచ్చారని ఆరా తీయగా.. కర్నాటక రైతులు పొంతన లేని సమాధానం చెప్పినట్లు తెలిసింది. మల్దకల్ మండలంలోని ఓ ప్రైవేట్ ఫర్టిలైజర్షాపులో ఈ సంచులు కొన్నట్లు సమాచారం.
పట్టుకున్న యూరియాను గట్టు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వారం కిందట నారాయణపేట జిల్లా కేంద్రం నుంచి కర్నాటకకు చెందిన రెండు జీపులు, ఒక ఆటోలో 34 బస్తాల యూరియాను తరలిస్తున్న విషయాన్ని జిలాల్‌పూర్ గ్రామ రైతులకు తెలిసింది. ఈ విషయాన్ని వారు పోలీసులకు చెప్పగా.. యూరియాను తరలిస్తున్న మూడు వాహనాలను పట్టుకొని సీజ్ చేశారు.