ఏసీబీకి దమ్కీ ఇచ్చిన పంచాయతీ సెక్రటరీ.. రూ. 50 వేలు లంచం తీసుకుంటూ చిక్కినట్టే చిక్కి కారులో పరార్

ఏసీబీకి దమ్కీ ఇచ్చిన పంచాయతీ సెక్రటరీ.. రూ. 50 వేలు లంచం తీసుకుంటూ  చిక్కినట్టే చిక్కి కారులో పరార్

 తెలంగాణ వ్యాప్తంగా అవినీతి అధికారుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది ఏసీబీ. లంచం తీసుకుంటున్న ప్రభుత్వ అధికారుల భరతం పడుతోంది. ఫిర్యాదులు వచ్చిన వెంటనే రంగంలోకి దిగి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటోంది ఏసీబీ. అయినా ప్రభుత్వ అధికారుల తీరు మారడం లేదు. లంచాల కోసం టేబుల్ కింద చేయిపెడుతున్నారు. 

లేటెస్ట్ గా జులై 25న రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం ఇమ్ముల్ నర్వ పంచాయతీ కార్యదర్శి కె. సురేందర్  లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో చిక్కినట్టే చిక్కి తప్పించుకున్నాడు. ఇంటి నిర్మాణం కోసం  ఇచ్చిన నోటీసుల విషయంలో  రూ.లక్ష లంచం డిమాండ్ చేశాడు పంచాయతీ సెక్రటరీ సురేందర్. ఇందులో భాగంగా రూ. 50 వేలు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులు పక్కా ప్లాన్ తో   శంషాబాద్ లోని ఓ హోటల్ దగ్గర రూ. 50 వేలు  లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు చిక్కాడు పంచాయతీ సెక్రటరీ సురేందర్ .అయితే ఏసీబీకి  చిక్కినట్టే చిక్కిన సురేందర్ హోటల్ నుంచి కారులో పరారయ్యాడు. కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు అతడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. 

రాష్ట్రంలో ఏసీబీ అన్ని శాఖలను జల్లెడ పడ్తున్నది. లంచగొండుల గుండెల్లో రైళ్లు పరుగెట్టిస్తున్నది. ఏడు నెలల్లో ఏకంగా 142 కేసులు నమోదు చేసింది. 145 మంది అవినీతి అధికారులను పట్టుకున్నది. కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏసీబీకి ఫ్రీ హ్యాండ్​ ఇచ్చింది. అవినీతి అధికారులు ఏ శాఖలో ఉన్నా.. ఏ హోదాలో ఉన్నా.. ఉపేక్షించొద్దని తేల్చిచెప్పింది. ఫిర్యాదులు రాగానే వెంటనే రంగంలోకి దిగాలని ఆదేశించింది. దీంతో లంచాల విషయం తెలిస్తే తమకు సమాచారం అందించాలంటూ టోల్​ఫ్రీ నంబర్​ను, వాట్సాప్​ నంబర్​ను జనంలోకి విస్తృతంగా ఏసీబీ అధికారులు తీసుకెళ్తున్నారు.