అమెరికా ప్రతినిధుల సభలో  ‘గ్రీన్​ కార్డు’పై బిల్లు

అమెరికా ప్రతినిధుల సభలో  ‘గ్రీన్​ కార్డు’పై బిల్లు


వీసాల కోటా ఎత్తేసేందుకే  మనోళ్లకు మంచి అవకాశం
వాషింగ్టన్: గ్రీన్ కార్డుల జారీకి సంబంధించి వివిధ దేశాలకు విధించిన పరిమితి(కంట్రీ క్యాప్)ను తొలగించాలంటూ అమెరికా ప్రతినిధుల సభలో కొత్త బిల్లును ప్రవేశపెట్టారు. ఈక్వెల్ అక్సెస్ టు గ్రీన్ కార్డ్ ఫర్ లీగల్ ఎంప్లాయ్ మెంట్(ఈగల్) యాక్ట్, 2021 బిల్లును జో లొఫ్ గ్రెన్​, జాన్ కర్టిస్ ప్రతినిధుల సభలో ప్రవేశ పెట్టారు. ఈ బిల్లును ప్రతినిధుల సభ ఆమోదిస్తే.. సెనేట్​కు పంపిస్తారు. సెనేట్​ ఆమోదం కూడా పొందాక.. ప్రెసిడెంట్ సంతకంచేస్తే ఈ బిల్లు చట్టంగా మారనుంది. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న విదేశీయులకు నైపుణ్యం ఆధారంగా, ఆయా దేశాల కోటాను బట్టి ఏటా గ్రీన్​ కార్డులను జారీ చేస్తుంది. ప్రపంచంలోని అన్ని దేశాల వారికి సమాన ప్రాతినిథ్యం దక్కాలనే ఉద్దేశంతో కంట్రీ క్యాప్(ఒక్కో దేశానికి నిర్ణీత శాతం కోటా)ను అమలులోకి తెచ్చారు. ఈ పరిమితి ప్రకారం ఇండియాకు ఏటా 7% గ్రీన్​ కార్డులు కేటాయిస్తారు. మన దేశం నుంచి హెచ్​1 బి వీసాతో అమెరికా వెళ్లి పనిచేస్తున్న ఉద్యోగులకు ఈ నిబంధన పెద్ద అడ్డంకిగా మారింది. చాలా మంది ఉద్యోగులు ఏండ్ల తరబడి గ్రీన్​ కార్డు కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా ప్రవేశపెట్టిన బిల్లు చట్టంగా మారితే మన ఐటీ ఉద్యోగులకు ప్రయోజనం కలగనుంది. ఫ్యామిలీ స్పాన్సర్డ్ వీసాలను 7% నుంచి 15 శాతానికి పెంచాలని బిల్లులో పేర్కొన్నారు
స్కిల్డ్ పర్సన్స్​కు మంచి అవకాశం
'మన ఇమిగ్రేషన్ సిస్టమ్ సరిగా లేదు. ఇమిగ్రేషన్ వీసాలు కేటాయించే విధానం పాతబడిపోయింది. 1990లో దీన్ని అప్ డేట్ చేశారు. ప్రతి దేశానికి 7% పరిమితి ఇప్పటికీ కొనసాగుతోంది. దీని వల్ల చాలా అప్లికేషన్లు పెండింగ్ లో పడ్డాయి. ఎక్కువ జనాభా ఉన్న దేశాలకు, తక్కువ జనాభా ఉన్న దేశాలకు ఒకటే పరిమితి విధించారు. దీని వల్ల ఎక్కు వ జనాభా ఉన్న దేశం నుంచి వచ్చిన నైపుణ్యం కలిగిన వ్యక్తి, మన దేశ ఎకానమీకి గొప్ప సేవలు అందిస్తున్న వ్యక్తి.. తక్కువ జనాభా ఉన్న దేశానికి చెందిన తక్కువ క్వాలిఫికేషన్స్ ఉన్న వ్యక్తి తర్వాత గ్రీన్ కార్డు పొందాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు స్కిల్డ్ పర్సన్స్ అమెరికాకు దూరం అవుతున్నారు. దీని వల్ల మన ఎకానమీకి నష్టం' అని కాంగ్రెస్ విమెన్,  డెమోక్రటిక్ పార్టీ మెంబర్ జో లోఫ్ గ్రెన్ అన్నారు. ఈగల్ యాక్ట్, 2021 బిల్లును ఇమిగ్రేషన్ వాయిస్ స్వచ్ఛంద సంస్థ స్వాగతించింది.