- ఇదే వేగం ఉంటే 15 వేల డాలర్లకు తలసరి ఆదాయం
- యువ జనాభాతో ఎంతో మేలు.. వాషింగ్టన్ ఎగ్జామినర్ రిపోర్ట్
న్యూఢిల్లీ: స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లు పూర్తయ్యే 2047 నాటికి భారత్ సంపన్న దేశంగా మారుతుందని అమెరికా వార్తాసంస్థ వాషింగ్టన్ ఎగ్జామినర్ వెల్లడించింది. దీని స్టడీ రిపోర్ట్ ప్రకారం..గత రెండు దశాబ్దాలుగా మనదేశం బలమైన ఆర్థిక వృద్ధిని నమోదు చేస్తోంది. 2003 నుంచి భారత ఆర్థిక వ్యవస్థ సగటున ఏడాదికి ఏడు శాతానికిపైగా వృద్ధి రేటు సాధిస్తోంది. ఇదే వేగం మరో 20 ఏళ్ల పాటు కొనసాగితే, తలసరి జీడీపీ 15 వేల డాలర్ల మార్కును దాటుతుంది.
దీనివల్ల బ్రెజిల్, దక్షిణాఫ్రికా, టర్కీ వంటి దేశాలు ఎదుర్కొన్న మిడిల్ ఇన్‌కమ్ ట్రాప్ సమస్య నుంచి భారత్ సులభంగా బయటపడవచ్చు. అనుకూలమైన ప్రభుత్వ విధానాలు, యువ జనాభా, పెరుగుతున్న సాంకేతిక పునాది భారత్ వృద్ధికి ఎంతో మేలు చేస్తున్నాయి. సగటు వయసు 28 ఏళ్లు మాత్రమే ఉండటం అమెరికా, చైనా వంటి దేశాల కంటే మనల్ని ముందుంచుతోంది.
రాబోయే దశాబ్దాల్లో పెద్ద సంఖ్యలో యువత శ్రామిక శక్తిలో చేరడం వల్ల ఉత్పాదకత పెరిగి వినియోగం కూడా పెరుగుతుంది. దీనివల్ల ఎగుమతులపై ఆధారపడకుండానే స్వదేశీ మార్కెట్ బలోపేతం అవుతుంది. ఉత్పాదకతను మెరుగుపరచడానికి ప్రభుత్వం హైవేలు, విమానాశ్రయాలు, ఓడరేవులు వంటి మౌలిక సదుపాయాల కల్పనపై భారీగా పెట్టుబడులు పెడుతోంది. సమర్థవంతమైన రవాణా వ్యవస్థ సరఫరా గొలుసును బలోపేతం చేస్తూ ఆర్థిక వ్యవస్థ విస్తరణకు తోడ్పడుతోంది.
చైనా నుంచి ఇండియాకు..
ప్రపంచవ్యాప్తంగా సప్లయ్ చెయిన్‌లో వస్తున్న మార్పులు భారత్‌కు కలిసి వస్తున్నాయి. అమెరికా వంటి దేశాలకు చెందిన కంపెనీలు చైనా నుంచి తమ కార్యకలాపాలను భారత్‌కు తరలిస్తున్నాయి. యాపిల్ వంటి అమెరికన్ కంపెనీలు ఇక్కడ తమ ఉనికిని పెంచుకోవడం వల్ల పెట్టుబడులతో పాటు సాంకేతికత కూడా అందుబాటులోకి వస్తోంది. డిజిటల్ మౌలిక సదుపాయాలు, మొబైల్ చెల్లింపులు, ఆన్‌లైన్ ప్రభుత్వ సేవలు లక్షలాది మందిని వ్యవస్థీకృత ఆర్థిక వ్యవస్థలోకి తీసుకువచ్చాయి.
స్టార్టప్ సంస్కృతి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ఫిన్ టెక్ రంగాల్లో వస్తున్న ఆవిష్కరణలు దేశాన్ని ఉన్నత స్థాయికి చేరుస్తున్నాయి. అవినీతి, రాజకీయ విభజనల వంటి సవాళ్లు ఉన్నప్పటికీ పన్నులు, న్యాయ వ్యవస్థ, విద్య వంటి రంగాల్లో చేపట్టిన సంస్కరణలు దీర్ఘకాలిక వృద్ధికి బాటలు వేస్తున్నాయి. స్టాక్ మార్కెట్ పనితీరు కూడా మదుపర్లలో నమ్మకాన్ని పెంచుతోందని వాషింగ్టన్ ఎగ్జామినర్ రిపోర్ట్ తెలిపింది.
