మరిన్ని ఎస్-400 కొనుగోలు.. రష్యాతో భారత్ చర్చలు

మరిన్ని ఎస్-400 కొనుగోలు.. రష్యాతో భారత్ చర్చలు
  • రష్యా రక్షణ శాఖ వర్గాలు వెల్లడి

న్యూఢిల్లీ: ఆపరేషన్​ సిందూర్​ సమయంలో  రక్షణ కవచంలా నిలిచిన ఎస్–400 ఎయిర్​ డిఫెన్స్​ సిస్టమ్స్​ను మరిన్ని సమకూర్చుకోవాలని భారత్​ ఆలోచిస్తున్నది. ఈ మేరకు రష్యాతో చర్చలు జరుపుతున్నట్టు ఆ దేశ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.  “భారత్ ఇప్పటికే మా ఎస్–-400 వ్యవస్థను కలిగి ఉంది. ఈ రంగంలో మా సహకారాన్ని మరింత విస్తరించే అవకాశం ఉంది. అంటే, కొత్త డెలివరీలు జరగనున్నాయి. 

ప్రస్తుతం మేం చర్చల దశలో ఉన్నాం” అని రష్యా ఫెడరల్ సర్వీస్ ఫర్ మిలిటరీ- టెక్నికల్ కోఆపరేషన్ చీఫ్ డిమిత్రీ షుగాయెవ్  చెప్పారు.   కాగా, 2018లో భారత్ ఆర్డర్ చేసిన ఐదు ఎస్–-400 యూనిట్లలో 3 ఇప్పటికే డెలివరీ కాగా..ఆదంపూర్ (పంజాబ్), తూర్పు సెక్టార్, పశ్చిమ సెక్టార్‌‌‌‌లలో మోహరించారు. మిగిలిన 2 యూనిట్లలో ఒకటి 2026 నాటికి, మరొకటి 2027 నాటికి డెలివరీ అవుతాయని అంచనా.

 వీటితోపాటు  భారత్ మరిన్ని ఎస్–-400 వ్యవస్థలను కొనుగోలు చేయాలని యోచిస్తున్నది. ఇవి దేశవ్యాప్తంగా రక్షణ కవచాన్ని అందించేందుకు రూపొందుతున్న ‘సుదర్శన చక్ర’ ప్రాజెక్ట్‌‌‌‌కు దోహదపడతాయని భావిస్తున్నది.

గగనతలంలో పవర్‌‌‌‌‌‌‌‌ఫుల్​ వెపన్​ ఎస్‌‌‌‌–400 

ఎస్–400 ఎయిర్​ డిఫెన్స్​ సిస్టమ్​ 600 కిలో మీటర్ల దూరంలోని శత్రు కార్యకలాపాలను గుర్తించే సామర్థ్యం కలిగి ఉంటుంది.  100 కంటే ఎక్కువ లక్ష్యాలను ఏకకాలంలో ట్రాక్ చేస్తుంది. 400 కిలో మీటర్ల ఫైరింగ్ రేంజ్‌‌‌‌తో.. బాంబర్లు, ఫైటర్ జెట్లు, డ్రోన్లు, ఎర్లీ వార్నింగ్ ఎయిర్‌‌‌‌క్రాఫ్ట్‌‌‌‌లు, బాలిస్టిక్ మిసైల్స్​ను కూడా నాశనం చేస్తుంది. ఒక్కో ఎస్–400 రెజిమెంట్ లేదా యూనిట్‌‌‌‌లో ఎనిమిది లాంచ్ వెహికల్స్​ ఉంటాయి, ప్రతి వాహనంలో 4  క్షిపణి ట్యూబ్‌‌‌‌లు ఉంటాయి. దీనిని ఆపరేషన్​ సిందూర్​ సమయంలో భారత్​ పూర్తిస్థాయిలో వాడుకున్నది.