
దుబాయ్: ఇండియా, పాకిస్తాన్ ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ క్రికెట్ చరిత్రలో ఒక మరపురాని విజయంతో పాటు, ఊహించని వివాదంతోనూ నిలిచిపోయింది. చిరకాల ప్రత్యర్థి పాక్‌పై గెలిచిన తొమ్మిదోసారి ఆసియా చాంపియన్‌గా నిలిచిన టీమిండియా సంబరాలకు రాజకీయ వివాదం అడ్డుపడింది.
ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ప్రెసిడెంట్, పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రి అయిన మోహ్‌సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరించేందుకు ఇండియా నిరాకరించడంతో ఫైనల్ ముగిసిన తర్వాత ఆదివారం అర్ధరాత్రి సుమారు90 నిమిషాల పాటు గ్రౌండ్‌లో హైడ్రామా నడిచింది. చివరికి నఖ్వీ విన్నర్ ట్రోఫీని తనతో పాటే తీసుకుని గ్రౌండ్ వీడటం పెను దుమారం రేపింది.
ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ప్రెసిడెంట్, పాక్ మంత్రి అయిన మోహ్‌సిన్ నఖ్వీ చేతుల మీదుగా ఆసియా కప్ ట్రోఫీని తీసుకునేందుకు ఇండియా నిరాకరించింది. అయితే, మరొకరి చేతుల మీదుగా ట్రోఫీని ఇప్పించడానికి అంగీకరించని నఖ్వీ దానిని తనతో పాటే తీసుకుని వెళ్లడంతో పెను దుమారం రేగింది.
అసలేం జరిగింది?
ఫైనల్లో గెలిచిన తర్వాత ఇండియా ఆటగాళ్లందరూ వేడుకలకు సిద్ధమయ్యారు. అయితే, ప్రజెంటేషన్ సెర్మనీ కోసం స్టేజ్‌పై ఉన్న పాక్ బోర్డు చైర్మన్ నఖ్వీ నుంచి ట్రోఫీ తీసుకునేందుకు ఇండియా జట్టు ససేమిరా అంది. ఆపరేషన్ సింధూర్‌ను ఎగతాళి చేస్తూ నఖ్వీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు.
ఇండియా సైన్యానికి మద్దతు తెలిపినందుకు సూర్యకుమార్‌పై చర్యలు తీసుకోవాలని ఐసీసీని డిమాండ్ చేశాడు. దాంతో దేశానికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్న వ్యక్తి చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరించలేమని ఇండియా, బీసీసీఐ స్పష్టం చేశాయి. ఇండియా నిరాకరణతో గంటకు పైగా క్లోజింగ్ సెర్మనీ నిలిచిపోయింది. నఖ్వీ కాకుండా స్టేజ్‌పై ఉన్న మరెవరి చేతుల మీదుగానైనా ట్రోఫీ తీసుకుంటామని ఇండియా సూచించినా అతను పక్కకు తప్పుకోలేదు. దీంతో ప్రజెంటర్ సైమన్ డౌల్ రన్నరప్, ఇండివిడ్యువల్ అవార్డులను మాత్రమే అనౌన్స్ చేశాడు.
నఖ్వీ నుంచి రన్నరప్ చెక్ తీసుకున్న వెంటనే పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ దాన్ని పక్కకు విసిరేసి వెళ్లిపోయాడు. ఆ తర్వాత నఖ్వీ స్టేజ్ దిగి వెళ్ళిపోతూ, ఏసీసీ సిబ్బంది ద్వారా ట్రోఫీని, మెడల్స్‌ను కూడా తనతో పాటే తీసుకెళ్లడంతో అంతా షాకయ్యారు. స్టేజ్ అంతా ఖాళీ అయ్యాక ఇండియా ట్రోఫీని అందుకున్నట్టుగా ఊహించుకుంటూ సంబరాలు చేసుకుంది.
బీసీసీఐ ఆగ్రహం..నఖ్వీని దించేందుకు ప్లాన్!
టీమిండియా ట్రోఫీ అందుకోకుండా నఖ్వీ తనతో తీసుకెళ్లడంపై బీసీసీఐ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నఖ్వీ తీరుపై ఐసీసీతోనే తేల్చుకుంటామని బోర్డు సెక్రటరీ దేవజిత్ సైకియా పేర్కొన్నారు.
‘మన దేశానికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్న వ్యక్తి నుంచి మేము ట్రోఫీని తీసుకోలేము. కానీ, మేము నిరాకరించినంత మాత్రాన ఆ పెద్ద మనిషికి ట్రోఫీ, మెడల్స్‌ను తన హోటల్‌కు తీసుకువెళ్లే అధికారం లేదు. ఇది పిల్లచేష్ట. నవంబర్‌లో దుబాయ్‌లో జరిగే ఐసీసీ సమావేశంలో దీనిపై మేం అత్యంత బలమైన నిరసన చేస్తాం. ట్రోఫీ, మెడల్స్‌ను వెంటనే ఇండియాకు తిరిగి ఇవ్వాలి’ అని పేర్కొన్నారు. కాగా, నఖ్వీని ఏసీసీ ప్రెసిడెంట్ పదవి నుంచి తొలగించేందుకు బీసీసీఐ ప్రయత్నాలు చేయనున్నట్లు తెలుస్తోంది.
‘ఒక చాంపియన్ జట్టుకు ట్రోఫీని నిరాకరించడం నేను ఎప్పుడూ చూడలేదు. ఇది మేం కష్టపడి గెలిచిన టోర్నమెంట్. ట్రోఫీ అందుకునేందుకు అన్ని విధాలా అర్హులం. అయినా మ్యాచ్ ముగిసిన తర్వాత ఎవరైనా చాంపియన్లనే మాత్రమే గుర్తుంచుకుంటారు.
ట్రోఫీ ఫోటోను కాదు. నా జట్టే నా ట్రోఫీ. పాక్ ప్లేయర్లతో హ్యాండ్‌షేక్ చేయొద్దని, నఖ్వీ నుంచి ట్రోఫీ తీసుకోవద్దని మాకు ఎవ్వరూ చెప్పలేదు. ఈ నిర్ణయాన్ని మేం గ్రౌండ్‌లోనే తీసుకున్నాం. ఈ టోర్నీలో ఆడినందుకు నాకొచ్చే మ్యాచ్ ఫీజు మొత్తాన్ని ఇండియా సైన్యానికి, పహల్గాం బాధితుల కుటుంబాలకు విరాళంగా ఇస్తున్నానని -సూర్యకుమార్ యాదవ్ ప్రకటించారు.