ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు.. ఉపాధి కూలీలు

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు.. ఉపాధి కూలీలు
  • ఇందిరమ్మ స్కీమ్ తో ఉపాధి హామీ పథకం అనుసంధానం 
  • జాబ్ కార్డు ఉన్న ఇండ్ల లబ్ధిదారులకు ఎంతో ప్రయోజనం 

మెదక్, వెలుగు : రాష్ట్రవ్యాప్తంగా నిరు పేదలకు మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేసేందుకు, లబ్ధిదారుల ఆర్థిక ఇబ్బందులను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఆలోచన చేస్తోంది.  ఇండ్ల నిర్మాణానికి  జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఉపాధి హామీ జాబ్ కార్డు కలిగిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు 90 రోజులు పని దినాలను అధికారులు కల్పించనున్నారు. 

ఇంటి నిర్మాణ సామగ్రి ధరలు ఎక్కువగా ఉండడంతో నిరుపేద లబ్ధిదారులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా రు. ఈ నేపథ్యంలో ఉపాధి  కూలీలు తమ ఇండ్ల నిర్మాణాల్లో పనులు చేసుకున్న రోజులకు నగదు చెల్లించడమే కాకుండా, మరోవైపు ఇండ్లను త్వరగా పూర్తి చేసేందుకు ఈ చర్యలు తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయంతో ఉపాధి హామీ కూలీలకు, ఇండ్ల లబ్ధిదారులకు ఎంతో మేలు కలగనుంది. రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ కు 3,500 ఇండ్లను మంజూరు చేయగా ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు చొప్పున అందిస్తోంది.

జాబ్ కార్డు ఉన్నవారికి..

 ఇండ్లు మంజూరైన లబ్ధిదారుల్లో ఉపాధి జాబ్ కార్డు ఉన్నవారిని ముందుగా హౌసింగ్ డిపార్ట్​మెంట్ అధికారులు గుర్తించనున్నారు.  అనంతరం  జాబితాను జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ) అధికారులకు అందజేస్తారు. ఇండ్ల లబ్ధిదారులకు ఉపాధి హామీ పథకాన్ని వర్తింపజేస్తూ పని దినాలు కల్పించనున్నారు. ఒక్కో లబ్ధిదారుడికి బేస్​మెంట్​వరకు 40 రోజులు, పైకప్పు వరకు 50 పని దినాలు కేటాయించనున్నారు. 

ఒక ఉపాధి హామీలో భాగంగా ఒక్కో కుటుంబానికి నిర్దేశించిన 120 రోజుల పని దినాల్లో గరిష్టంగా 90 రోజులు ఇండ్ల నిర్మాణ పనులకు కేటాయించనున్నారు. ఇప్పటికే 90 రోజుల్లో 20, 30 పని దినాలు పూర్తి చేసిన ఉపాధి కూలీలకు వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఆ రోజులను లెక్కించాలని  రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఉపాధి హామీ మార్గదర్శకాల మేరకు ఇంటి నిర్మాణంలో పాల్గొనే కూలీలకు పని చేసిన రోజుల డబ్బులు ఖాతాల్లో జమ చేయనున్నారు. 

నైపుణ్యం లేని కూలీ పనులకు.. 

 నైపుణ్యం లేని కూలీలకు కూడా ఇంటి పనుల్లో అవకాశం కల్పించింది. ఉపాధి కూలీలు ఇంటి నిర్మాణానికి సంబంధించి పునాది తవ్వకం, బేస్​మెంట్ నిర్మాణం, బరంతి నింపడం, గోడల నిర్మాణ పనులు, ఇటుక మోయడం, వాటర్ క్యూరింగ్ వంటి పనులు చేస్తే కూడా ఉపాధి హామీ పని కింద వేతనం చెల్లించనున్నారు. ప్రభుత్వ నిర్ణయం ద్వారా ఎక్కువమందికి లబ్ధి చేకూరనుంది.  

గైడ్ లైన్స్ వచ్చాక చర్యలు తీసుకుంటాం 

ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ కు జాతీయ ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దీనికి సంబంధించి స్పష్టమైన విధివిధానాలు ఇంకా మాకు అందలేదు. అవి రాగానే గైడ్ లైన్స్ మేరకు లబ్ధిదారులకు ఆ ప్రయోజనాలు చేకూరేలా చర్యలు తీసుకుంటాం.‌‌‌‌శ్రీనివాస్ రావు, డీఆర్డీవో, మెదక్ జిల్లా