అల్లుడు బ్రిటన్ ప్రధాని కావడంపై ఇన్ఫోసిస్ నారాణమూర్తి హర్షం

అల్లుడు బ్రిటన్ ప్రధాని కావడంపై ఇన్ఫోసిస్ నారాణమూర్తి హర్షం

బెంగళూరు: రిషి సునాక్ బ్రిటన్ ప్రధాని కావడం పట్ల భారతీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రెండు వందల సంవత్సరాలకు పైగా భారత్ ను పాలించిన బ్రిటన్ కు ఓ భారతీయుడు ప్రధాని కావడం భారతీయులందరికీ గర్వకారణం. ఈ నేపథ్యంలోనే బ్రిటన్ పీఎంగా ఎన్నికైన రిషి సునాక్ కు ప్రముఖులు విషెస్ చెబుతున్నారు. తాజాగా ఇన్ఫోసిన్ ఫౌండర్, రిషి సునాక్ మామ నారాయణ మూర్తి స్పందించారు. తమ అల్లుడు (రిషి సునాక్) బ్రిటన్ కు ప్రధానిగా ఎన్నిక కావడం చాలా ఆనందంగా ఉందన్నారు. రిషి ఎన్నిక తమ కుటుంబానికే కాక యావత్తు భారత్ కు చాలా గర్వకారణమని తెలిపారు. ప్రధానిగా రిషి బ్రిటన్ ప్రజలకు అత్యున్నత సేవలు అందిస్తారనే నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2009లో  ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి కూతురు అక్షతామూర్తితో రిషి సునాక్ కు బెంగళూరులో వివాహమైంది. రిషి, అక్షతామూర్తి దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. 

ఇక.. బ్రిటన్ కు కొత్త ప్రధానిగా ఎన్నికైన రిషి సునాక్ కు భారత ప్రధాని మోడీ శుభాకాంక్షలు  తెలిపారు. రిషి నాయకత్వంలో బ్రిటన్ మరింత ఆర్ధికాభివృద్ధిని సాధిస్తుందని మోడీ తెలిపారు. ‘‘1947లో స్వాతంత్ర్యం వేళ భారత నాయకులందరూ తక్కువ స్థాయిని కలిగి ఉంటారని, వారిలో తక్కువ శక్తిసామర్థ్యాలు ఉంటాయంటూ విన్‌స్టన్ చర్చిల్ అవహేళన చేశారు. కానీ, దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తైన ఈ సందర్భంలో భారతీయ సంతతికి చెందిన ఓ వ్యక్తి బ్రిటన్‌ పగ్గాలు చేపట్టడం ద్వారా వారికి తగిన జవాబు ఇచ్చారు. జీవితం ఎంతో అందమైంది’’ అంటూ ఆనంద్ మహింద్రా ట్వీట్‌ చేశారు.