మురళి, వంగూరు, వెలుగు: నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని వంగూరు మండలంలో నిర్మాణంలో ఉన్న తెలంగాణ పబ్లిక్ స్కూల్ పనులను రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ డాక్టర్ ఆకునూరి మురళి, కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ శుక్రవారం పరిశీలించారు. డాక్టర్ ఆకునూరి మురళి మాట్లాడుతూ వంగూరు, పోల్కంపల్లి గ్రామాల్లో నిర్మాణంలో ఉన్న ఈ పాఠశాలలు గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన, ఆధునిక విద్య అందించే కేంద్రాలుగా మారనున్నాయని వారు తెలిపారు. నిర్మాణ పనుల నాణ్యత, పురోగతిని సమీక్షించిన వారు తరగతి గదులు, లైబ్రరీలు, సైన్స్, కంప్యూటర్ ప్రయోగశాలలు, తాగునీటి సదుపాయం, మరుగుదొడ్లు, మైదానాలు తదితర మౌలిక వసతుల ఏర్పాటుపై అధికారులకు సూచనలు చేశారు.
గ్రామీణ విద్యార్థులకు పట్టణ స్థాయి విద్యా వసతులు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విశాలమైన తరగతి గదులు, డిజిటల్ లెర్నింగ్ సదుపాయాలు, ఆధునిక ప్రయోగశాలలు, గ్రంథాలయాలు, క్రీడా మైదానాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ మాట్లాడుతూ నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు కచ్చితంగా పాటిస్తూ గడువులోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పురుగుల యాదయ్య, డిప్యూటీ సర్పంచ్ మండపల్లి భాస్కర్ పాల్గొన్నారు.
