
- త్వరలోనే ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీల్లో తనిఖీలు చేస్త: ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు, ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో ప్రాక్టికల్స్ ల్యాబ్ క్లాసులు నిర్వహించాలని ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య తెలిపారు. టైమ్ టేబుల్లోనూ దీన్ని భాగంగా చేర్చాలని ఆదేశించారు. వివిధ ఆరోపణల నేపథ్యంలో ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీల్లో తాను స్వయంగా కొన్ని కాలేజీలను తనిఖీ చేస్తానని స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీల మేనేజ్మెంట్ల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
సీసీ కెమెరాల పర్యవేక్షణలోనే ల్యాబులను పెట్టాలని ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి కాలేజీలో స్పోర్ట్స్, యోగా క్లాసులను పెట్టాలని సూచించారు. పరీక్షలు సమీపిస్తున్న కొద్ది విద్యార్థుల్లో ఒత్తిడికి లోనయ్యే ధోరణి పెరిగే అవకాశం ఉందని.. మేనేజ్మెంట్లు ఇలాంటి ఒత్తిడిలేని విద్యా వాతావరణాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. తద్వారా విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం, పోటీ తత్వం, మానవ సంబధాలు, భావోద్వేగ నియంత్రణ వంటి విలువలు పెంపొందుతాయన్నారు. స్టూడెంట్లకు అవసరమైన కౌన్సెలింగ్ సేవలను అందించాలన్నారు. సమావేశంలో ప్రైవేటు కాలేజీల మేనేజ్మెంట్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గౌరీసతీశ్, ఇతర నేతలు పాల్గొన్నారు.
అడ్మిషన్లకు ఇయ్యాల ఆఖరు తేదీ
టెక్నికల్ ఇష్యూతో ఆగిపోయిన ఇంటర్ విద్యార్థుల అడ్మిషన్ల ప్రక్రియను ఈ నెల17లోగా పూర్తి చేయాలని ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య సూచించారు. ప్రైవేటు కాలేజీల్లో చదివే స్టూడెంట్లకు ఒక్కో అడ్మిషన్‌కు రూ.వెయ్యితో పాటు అడ్మిషన్ డేటాలో కరక్షన్ కు రూ.250 రుసుముతో సరిచేసుకోవచ్చని చెప్పారు. అయితే, సర్కారు కాలేజీలు, గవర్నమెంట్ సెక్టార్ కాలేజీల్లోని పిల్లలకు ఉచితంగా ఈ సేవలు ఉంటాయని వెల్లడించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.