ఆరెంజ్ జ్యుస్ అంటే ఎవరికీ ఇష్టం ఉండదు చెప్పండి. ఒకప్పుడు ఆరెంజ్ జ్యూస్ చాలా ఆరోగ్యకరమైన జ్యుస్ అనుకునేవారు. కానీ, మధ్యలో కొంతమంది నిపుణులు ఇందులో చక్కెర శాతం ఎక్కువ కాబట్టి, దీనివల్ల షుగర్ పెరుగుతుంది, లావవుతారు అని హెచ్చరించడంతో ప్రజల్లో కాస్త భయం మొదలైంది. అయితే, తాజా పరిశోధనల ప్రకారం.. పండ్ల రసంలో చక్కెర ఉన్న కూడా దానివల్ల మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని తేలింది. ముఖ్యంగా ఇంట్లో చేసుకున్న ఫ్రెష్ జ్యూస్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
ఆరెంజ్ జ్యూస్ తాగడం వల్ల లాభాలు:
1. గుండె ఆరోగ్యం: రోజూ మోతాదులో ఆరెంజ్ జ్యూస్ తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్లో ఉంటాయి. ఈ జ్యుస్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ పెంచుతుంది. దీనివల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. అధిక బరువు ఉన్నవారిలో రక్తపోటు (BP) తగ్గడానికి కూడా ఈ జ్యుస్ సహాయపడుతుంది.
2. మెదడు చురుగ్గా పనిచేస్తుంది: సాధారణ చక్కెర పానీయాల కంటే ఆరెంజ్ జ్యూస్ తాగే వారు ఎక్కువ అలెర్ట్ ఉంటారని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ జ్యుస్ ఏకాగ్రతను పెంచుతుంది, మెదడు అలసిపోకుండా చూస్తుంది. ముఖ్యంగా వృద్ధులలో జ్ఞాపకశక్తిని, ఆలోచనా సామర్థ్యాన్ని పెంచుతుంది.
3. రోగనిరోధక శక్తి: నారింజ రసంలో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. విటమిన్-సి మన శరీరానికి రోగనిరోధక శక్తిని ఇచ్చి, జలుబు, ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది. అలాగే చర్మాన్ని యవ్వనంగా, కాంతివంతంగా ఉంచే 'కొల్లాజెన్' ఉత్పత్తికి సహాయపడుతుంది.
4. యాంటీ-ఆక్సిడెంట్లు : మన శరీరంలోని కణాలు దెబ్బతినకుండా కాపాడే యాంటీ-ఆక్సిడెంట్లు ఇందులో చాలా ఉంటాయి. ఇవి క్యాన్సర్, మధుమేహం వంటి వ్యాధులు రాకుండా అడ్డుకుంటాయి.
ALSO READ : ఓట్జెంపిక్ అంటే ఏమిటి?
5. రోజుకు 500ml నారింజ రసం తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి, ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడుతుంది, చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అధిక బరువు ఉన్న పెద్దలలో రక్తపోటును తగ్గిస్తుంది, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది, గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.
గుర్తుంచుకోవలసిన విషయాలు:
పండును నేరుగా తింటే అందులో ఫైబర్ (పీచు పదార్థం) ఎక్కువగా ఉంటుంది, ఇది షుగర్ పెరగకుండా చూస్తుంది. జ్యూస్‌లో ఫైబర్ తక్కువగా ఉంటుంది కాబట్టి, జ్యూస్ తాగేటప్పుడు అందులో విడిగా చక్కెర కలపకుండ ఉండడం మంచిది. బయట దొరికే ప్యాకెట్ జ్యూస్‌ల కంటే ఇంట్లో ఫ్రెష్ గా చేసుకున్న జ్యూస్ తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఎంత ఆరోగ్యకరమైనదైనా సరే, రోజుకు కావాల్సినంత మోతాదుకు మించి తీసుకోకూడదు. పెద్ద అధ్యయనాలు సిట్రస్ పండ్లను పూర్తిగా తినేవారికి, కనీసం రెండు నుండి మూడు తినేవారికి గుండె జబ్బులు లేదా స్ట్రోక్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉందని చూపిస్తున్నాయి.
