US News: యూఎస్ విశ్వవిద్యాలయాల్లో ఫారెన్ విద్యార్థులను నో ఎంట్రీ..! అసలు ట్రంప్ ఏం చెప్తుండు?

US News: యూఎస్ విశ్వవిద్యాలయాల్లో ఫారెన్ విద్యార్థులను నో ఎంట్రీ..! అసలు ట్రంప్ ఏం చెప్తుండు?

Trump Vs Harvard: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్యలు అమెరికాలోని ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల మనుగడను పూర్తిగా దెబ్బతీసేలా కనిపిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని కళాశాలలకు ట్రంప్ ప్రభుత్వం ఫండింగ్ నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే హార్వర్డ్ విశ్వవిద్యాలయం మాత్రం ట్రంప్ ప్రభుత్వ చర్యలను కోర్టులో ఎండగడుతూ పోరాడుతోంది. ప్రస్తుతం ట్రంప్ సర్కార్ చర్యలు హార్వర్డ్ కళాశాలలోని దాదాపు 6వేల 300 మంది విదేశీ విద్యార్థుల భవితవ్యాన్ని ప్రశ్నార్థంగా మార్చేస్తోంది. 

ఇదే క్రమంలో వైట్ హౌస్ ఓవల్ ఆఫీసు నుంచి శుక్రవారం ట్రంప్ మాట్లాడుతూ హార్వర్డ్ విద్యాసంస్థ తన తీరును మార్చుకోవాలని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. వాస్తవానికి అమెరికా హోమ్లాండ్ సెక్యూరిటీ హార్వర్డ్ విదేశీ విద్యార్థులను ఎన్ రోల్ చేసుకోకుండా నిలిపివేస్తామని హెచ్చరించిన తర్వాత ప్రస్తుత కామెంట్స్ వచ్చాయి. అమెరికా ప్రభుత్వం విశ్వవిద్యాలయానికి బిలియన్ డాలర్ల ఫండింగ్ ఇచ్చిందని.. కానీ యాజమాన్యం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ట్రంప్ సీరియస్ అయ్యారు. ఇతర కళాశాలలు కూడా తమ తీరు మార్చుకోవాల్సిందేనని ట్రంప్ అన్నారు. 

ఇదే క్రమంలో హార్వర్డ్ మాదిరిగా ఇతర కళాశాలలపై కూడా విద్యార్థులను చేర్చుకోవటంపై నిషేధం విధిస్తారా అంటూ ప్రెస్ అడిగిన ప్రశ్నకు బదులిచ్చిన ట్రంప్ దానిపై తాము ఆలోచిస్తామని అన్నారు. కనీస అర్హతలు లేని వారిని సైతం హార్వర్డ్ చేర్చుకుంటోందని ఈ క్రమంలో ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే ఇదే క్రమంలో శుక్రవారం అమెరికాలోని ఫెడరల్ కోర్టు హార్వర్డ్ కళాశాల విదేశీ విద్యార్థులను చేర్చుకోవచ్చంటూ అనుకూలంగా తీర్పును ప్రకటించింది. బోస్టన్ కోర్టులో హార్వర్డ్ ట్రంప్ ప్రభుత్వ నిర్ణయంపై దావా వేస్తూ ఇది చట్టవిరుద్ధ చర్యగా పేర్కొంది. అలాగే ట్రంప్ సర్కార్ చర్యలు దాదాపు 7వేల మంది వీసా హోల్డర్లను ప్రభావితం చేస్తాయని కోర్టుకు వెల్లడించింది. 

 

ట్రంప్ కేవలం ఒక్క సంతకంతో దాదాపు నాలుగించ ఒకవంతు విద్యార్థుల సంఖ్యను ప్రభావితం చేయాలని చూసిందని హార్వర్డ్ కోర్టుకు తెలిపింది. అలాగే ఇది కళాశాల లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన భారీగా సమకూరే నిధులను అడ్డుకుందని పేర్కొంది. ఇప్పటికే ట్రంప్ రూ.24వేల కోట్లకు పైగా నిధులను ప్రభుత్వం నుంచి వెళ్లకుండా అడ్డుకోగా.. కాలేజ్ పన్ను రహిత స్టేటస్ రద్దు చేస్తానని వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. వీటిపై హార్వర్డ్ కోర్టుల్లో పోరాడుతున్న సమయంలోనే ట్రంప్ మరింత ఒత్తిడిని పెంచుతున్నట్లు ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే తెలుస్తోంది.