పాత బస్తీని ఇస్తాంబుల్​ చేసి చూపిస్తా

పాత బస్తీని ఇస్తాంబుల్​ చేసి చూపిస్తా
  • కరీంనగర్‌‌‌‌ను డల్లాస్‌‌‌‌ చేస్తమని చెప్పలే: కేసీఆర్
  • వైకుంఠ ధామాలకు ఉపాధి నిధులు వాడితే తప్పేంది?
  • పెట్రోల్‌‌‌‌ను జీఎస్టీలోకి తెచ్చి కేంద్రం గుంజుకోవాలని చూసింది
  • రాష్ట్రాల హక్కులు హరించడంలో కాంగ్రెస్‌‌‌‌, బీజేపీ ఒక్కటే
  • హక్కులు కాపాడుకునేందుకు కేంద్రంతో కొట్లాటకు రెడీ
  • అసెంబ్లీలో పల్లె, పట్టణ ప్రగతిపై జరిగిన చర్చలో సీఎం


హైదరాబాద్‌‌‌‌, వెలుగు: కరీంనగర్‌‌‌‌ను డల్లాస్‌‌‌‌ చేస్తమని తాను చెప్పలేదని, ఓల్డ్‌‌‌‌ సిటీని ఇస్తాంబుల్‌‌‌‌ చేస్తమని చెప్పానని సీఎం కేసీఆర్ అన్నారు. దశలవారీగా ఇస్తాంబుల్‌‌‌‌గా చేసి చూపిస్తానని చెప్పారు. ప్రజల్లో పాజిటివ్‌‌‌‌ యాటిట్యూడ్‌‌‌‌ పెంచేందుకు ప్రయత్నించొద్దా, కలలు కనొద్దా అని ప్రశ్నించారు. ఉపాధి హామీ నిధులు ఐక్యరాజ్య సమితి నుంచి వస్తలేవని, కేంద్రానికి తెలంగాణ ఇస్తున్న నిధులతో పోల్చితే తిరిగి వస్తున్నది చాలా తక్కువ అని అన్నారు. భూములను రెగ్యులరైజ్ చేస్తూ పోతే ఆక్రమణలు జరుగుతూ ఉంటాయని, వాటికి ఫుల్‌‌‌‌స్టాప్‌‌‌‌ పెట్టాలని కామెంట్ చేశారు. పెట్రోల్‌‌‌‌ను జీఎస్టీ పరిధిలోకి చేర్చి కేంద్రం గుంజుకోవాలని చూసిందని ఆరోపించారు. రాష్ట్రాల హక్కులు హరించడంలో కాంగ్రెస్‌‌‌‌, బీజేపీ దొందూ దొందేనని అన్నారు. రాష్ట్రాల హక్కులను కాపాడుకునేందుకు కేంద్రంతో కొట్లాటకు తాము సిద్ధమన్నారు.  గురువారం అసెంబ్లీలో పల్లె, పట్టణ ప్రగతిపై నిర్వహించిన షార్ట్‌‌‌‌ డిస్కషన్‌‌‌‌లో కేసీఆర్ మాట్లాడారు.
ఆ విషయం అంబేద్కర్‌‌‌‌ దృష్టికి రాలేదేమో
పన్నుల్లో రాష్ట్రాల వాటా రాజ్యాంగం కల్పించిన హక్కు అని కేసీఆర్ అన్నారు. స్థానిక సంస్థలకు ఇచ్చే పన్నుల్లో వాటాను 15వ ఆర్థిక సంఘం తగ్గించిందన్నారు. ‘‘ఉమ్మడి జాబితాలోని అంశాలపై కేంద్రం ఏకపక్షంగా వ్యవహరిస్తోంది. ఉమ్మడి జాబితాలోని అంశాలపై కేంద్రం మొదట చట్టం చేస్తే అది కేంద్రం పరిధిలోకే పోతుంది. ఈ అంశం రాజ్యాంగం రాసే టైంలో అంబేద్కర్‌‌‌‌ దృష్టికి రానట్టు ఉంది’’ అని చెప్పారు. ‘‘తెలంగాణ ఇండియాల లేనట్టు.. ఈజీఎస్‌‌‌‌ నిధులు ఐక్యరాజ్యసమితి ఇస్తున్నట్టు మాట్లాడుతున్నరు. ఈజీఎస్‌‌‌‌ చట్టానికి లోబడే పనులు చేస్తున్నం. లక్ష కల్లాలు, వైకుంఠధామాలు నిర్మించేందుకు ఈజీఎస్‌‌‌‌ నిధులు వాడితే తప్పేంటి? కేంద్ర మంత్రి, సెక్రటరీ వచ్చి చూసిపోయి బాగా చేస్తున్నరని మెచ్చుకున్నరు. నిన్న తమిళనాడు సీఎం స్టాలిన్‌‌‌‌ ఉత్తరం రాసిండు. రాష్ట్రాల హక్కులు కాపాడేందుకు కేంద్రంతో పోరాడుతం. లక్నోలో నిర్వహించిన జీఎస్టీ కౌన్సిల్‌‌‌‌ సమావేశంలో పెట్రోల్‌‌‌‌ను జీఎస్టీ పరిధిలోకి లాక్కోవాలని చూసిండ్రు. మనతోపాటు బీజేపీ పాలిత రాష్ట్రాలు ‘బంద్‌‌‌‌ కరో’ అన్నయ్‌‌‌‌’’ అని కేసీఆర్ చెప్పారు.ప్రతి నెల గ్రామాలకు రూ.227 కోట్లు, మున్సిపాలిటీలకు రూ.112 కోట్ల చొప్పున విడుదల చేస్తున్నామన్నారు. 
బస్తీల మునక.. మీ పుణ్యమే
అదృష్టం కొద్దీ హైదరాబాద్‌‌‌‌ మన రాష్ట్రంలో ఉందని కేసీఆర్ అన్నారు. హైదరాబాద్‌‌‌‌ను తానే కట్టానని ఒకాయన గొప్పలు చెప్పుకునే వాడని, కొన్ని కంపెనీల పేర్లు చెప్పి తామే అభివృద్ధి చేశామని భట్టి విక్రమార్క చెప్తున్నారని ఎద్దేవా చేశారు. ‘బస్తీ.. బస్తీ.. బస్తియా బన్‌‌‌‌తీ హై’ అనే సామెత ఉందని, అలాగే హైదరాబాద్‌‌‌‌ అభివృద్ధికి నాలుగు వందల ఏళ్ల చరిత్ర ఉందన్నారు. ‘‘బస్తీలు నీళ్లల్లో మునుగుతున్నయ్‌‌‌‌. ఆ పుణ్యం మేం చేసినమా? మీరు కట్టుకున్నదే. మేం సదురలేక, తప్పులు సవరించలేక సత్తున్నం’’ అని కాంగ్రెస్‌‌‌‌పై మండిపడ్డారు. 
బట్టకు, పొట్టకు లోటులేకుండా చేస్తున్నం
కాంగ్రెస్‌‌‌‌ పాలనలో రైతులకు సరిగా విత్తనాలు కూడా ఇవ్వలేదని, తాము కరోనా టైంలోనూ ప్రతిగింజ కొన్నామని సీఎం కేసీఆర్ చెప్పారు. ప్రజలు బట్టకు, పొట్టకు లోటులేకుండా కావాలని పట్టుబట్టి చేస్తే దాని ఫలితం కనబడుతుందని అన్నారు. పల్లె ప్రగతితో గ్రామాలు శుభ్రమై అంటురోగాలు, విషజ్వరాలు పోయాయని, భగీరథతో కమ్యూనికేటివ్‌‌‌‌ డిసీజెస్‌‌‌‌ తగ్గాయని కేసీఆర్ చెప్పారు. 
ఏడేండ్లలో రూ.58 వేల కోట్లిచ్చినం..
‘‘గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి కోసం రూ.36 వేల కోట్లు, రోడ్ల కోసం రూ.8,536 కోట్లు ఖర్చు చేసినం. గ్రామ పంచాయతీలకు రూ.13,767 కోట్లు ఇచ్చినం. మొత్తంగా గ్రామాల్లో అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన కోసం ఈ ఏడేళ్లలో రూ.58,303 కోట్లు ఖర్చు చేసినం’’ అని సీఎం చెప్పారు. కార్మికుల జీతాలు భారీగా పెంచడంతోపాటు ఉద్యోగులతో సమానంగా పీఆర్సీ కల్పించామన్నారు. ధరణి పోర్టల్‌‌‌‌ తెచ్చిన తర్వాత దేవాదాయ, వక్ఫ్‌‌‌‌ భూములను రిజిస్ట్రేషన్‌‌‌‌ చేయకుండా ఫ్రీజ్‌‌‌‌ చేశామని తెలిపారు. ఎంఐఎం సభ్యులు కోరినట్టుగా వక్ఫ్‌‌‌‌ భూములపై సీఐడీ విచారణకు వెంటనే ఆదేశిస్తామని తెలిపారు.


డల్లాస్‌‌‌‌ కాదు.. నేను చెప్పింది లండన్‌‌‌‌
‘‘పాతబస్తీ ఇస్తాంబుల్‌‌‌‌ ఎప్పుడయితది అని అడుగుతున్నరు.. ఏం కలలు కనొద్దా? చేయాలని కోరుకోవద్దా? బరాబర్‌‌‌‌ చేసి చూపిస్త.. కరీంనగర్‌‌‌‌ను డల్లాస్‌‌‌‌ చేస్తామని అనలే.. కొందరు అట్ల అనుకుంటున్నరు.. లండన్‌‌‌‌లోని థేమ్స్‌‌‌‌నది లెక్క మానేరుపై తీగల వంతెన కట్టి, చెక్‌‌‌‌డ్యాంలు కడితే అయితదని చెప్పిన. డల్లాస్‌‌‌‌ అమెరికాల ఉంటది. నేను చెప్పింది లండన్‌‌‌‌. కరీంనగర్‌‌‌‌ల తీగల వంతెన అయితంది.. మానేరు గోదావరిలో కలిసే 90 కి.మీ.ల పొడవునా జీవనది అయితది.. ఒక్క బటన్‌‌‌‌ నొక్కితే కాళేశ్వరం నీళ్లు వస్తయి.. శాసనసభలో చర్చ తీరు ఇదేనా.. బయట సోషల్‌‌‌‌ మీడియా మోపైంది.. వాళ్లు ఏది పడితే అది చూపిస్తరు’’ అని ఫైర్ అయ్యారు.