ఆన్లైన్లో రేటింగ్ ఇస్తున్నారా..? సంగారెడ్డి జిల్లాలో ఐటీ ఉద్యోగి రూ.54 లక్షలు ఎలా మోసపోయాడో చూడండి !

ఆన్లైన్లో రేటింగ్ ఇస్తున్నారా..? సంగారెడ్డి జిల్లాలో ఐటీ ఉద్యోగి రూ.54 లక్షలు ఎలా మోసపోయాడో చూడండి !

సైబర్ దొంగలు ఎప్పుడు ఎలా అకౌంట్లను స్వాహా చేస్తారో అర్ధం కాని పరిస్థితి. సైలెంట్ గా.. ఫ్రాక్షన్ ఆఫ్ సెకన్స్ లో.. డబ్బులు కాజేస్తూ ఆందోళనకు గురిచేస్తున్నారు.  జేబు దొంగలు, పర్సు దొంగల నుంచి ఏదో ఒక క్షణంలో అలర్ట్ గా ఉండొచ్చుగానీ.. ఈ సైబర్ నేరగాళ్ల ఉచ్చులో నుంచి చాలా మంది తప్పించుకోలేకపోతున్నారు. సంగారెడ్డి జిల్లాలో ఓ ఐటీ ఉద్యోగి 54 లక్షల రూపాయలు మోసపోవడం కలకలం రేపింది. 

సంగారెడ్డి జిల్లాలో ఐటీ ఉద్యోగిని ట్రాప్ చేశారు సైబర్ క్రిమినల్స్. బ్రాండెడ్ వస్తువులకు రేటింగ్ ఇస్తే కమిషన్ ఇస్తామని ఆశ చూపారు. అందులో భాగంగా ఇన్వెస్ట్ చేయాలని సూచించారు. మొదట 5 వేలకు 12 వేల రూపాయలు పంపారు. ఇది నమ్మిన ఎంప్లాయ్ ఏకంగా 54 లక్షల రూపాయల వరకు ఇన్వెస్ట్ చేశాడు. మోసపోయానని తెలుసుకునేలోపే ఎస్కేప్ అయ్యారు. 

సంగారెడ్డి జిల్లాకు చెందిన ఐటీ ఉద్యోగి పటాన్ చెరులో నివాసం ఉంటున్నాడు. బ్రాండెడ్ వస్తువులకు రేటింగ్ ఇస్తే కమిషన్ ఇస్తామని సెప్టెంబర్ 5న టెలిగ్రామ్ లో మెసేజ్ పంపారు. రేటింగ్స్ ఇచ్చే క్రమంలో.. ఇన్వెస్ట్ చేస్తే లాభాలు కూడా వస్తాయని ఆశ చూపారు. 

ఉద్యోగిని నమ్మించేందుకు ఐదు వేలకు 7 వేల లాభంతో కలిపి  మొత్తం 12 వేల రూపాయలు పంపారు. ఈ ఆఫరేదో బాగుందని సదరు ఉద్యోగి పెట్టుబడి పెంచుకుంటూ వెళ్లాడు. ఆ విధంగా మొత్తం 54 లక్షల రూపాయలు పెట్టబడి పెట్టాక అన్నీ స్వాహా చేసి సర్దుకున్నారు దుండగులు. 

తన ఇన్వెస్ట్మెంట్, తన డబ్బుల కోసం ఎంత ప్రయత్నించినా అటు నుంచి రెస్పాన్స్ లేకపోయేసరికి..మోసపోయానని తెలుసుకుని పటాన్ చెరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధిత ఉద్యోగి.