
Infosys News: ప్రస్తుతం దేశంలోని ఐటీ సేవల కంపెనీలు కొంత నెమ్మదించిన మార్కెట్లతో ఇబ్బంది పడుతున్నాయి. ప్రపంచ దిగ్గజ సంస్థలు సైతం తమ కోడింగ్ అవసరాలకు ఎక్కువగా ఏఐ టూల్స్ పైనే ఆధారపడుతున్నాయి. ఈ క్రమంలో కొత్త ఉద్యోగ అవకాశాలు సైతం చాలా వరకు తగ్గిన సంగతి వాస్తవం. ఇలాంటి సమయంలో విదేశీ మదుపరులు సైతం భారతీయ ఐటీ రంగంలో నుంచి తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు.
ఇలాంటి సమయంలో టాప్ ఐటీ కంపెనీల్లో ఒకటిగా కొనసాగుతున్న ఇన్ఫోసిస్ తన ఉద్యోగులకు సూపర్ ఆఫర్ ఒకటి ప్రకటించింది. కంపెనీ తన సీనియర్ ఉద్యోగులకు లేటరల్ హైరింగ్ ప్రక్రియలో పాల్గొంటున్నందుకు ఒక్కో ఇంటర్వ్యూకు రూ.700 చొప్పున క్యాష్ రివార్డ్ అందించాలని నిర్ణయించింది. అయితే కేవలం హెచ్ఆర్, లీడర్ షిప్ రోల్స్ మినహా మిగిలిన అన్ని హైరింగ్స్ విషయంలో కంపెనీకి ఉద్యోగి నియామకాల ప్రక్రియలో చేసే సహాయానికి రివార్డ్ అందించబడుతుందని కంపెనీ వెల్లడించింది.
అలాగే కంపెనీ ప్రకటించిన క్యాష్ రివార్డ్ పాలసీ కేవలం భారతదేశంలో నిర్వహించే హైరింగ్ ప్రక్రియకు మాత్రమే పరిమితం అవుతుందని కంపెనీ వెల్లడించింది. వాస్తవానికి కంపెనీ ఇలాంటి పథకాన్ని ప్రవేశపెట్టడం ఇదే తొలిసారిగా తెలుస్తోంది. ప్రస్తుతం ఏఐ యుగం కొనసాగుతున్నప్పటికీ అనుభవం కలిగిన, ప్రతిభ కలిగిన ఉద్యోగులకు మాత్రం ఐటీ రంగంలో డిమాండ్ కొనసాగుతూనే ఉంది. కంపెనీ అవసరాలకు సరిపోయే స్కిల్స్ కలిగిన ఉద్యోగులను హైరింగ్ చేసుకునేందుకు సీనియర్లు సహాయం అందించటానికి వీలుగా ప్రస్తుత చర్యలు వచ్చినట్లు తెలుస్తోంది. పైగా టాలెంట్ స్టాఫ్ కోసం డిమాండ్ ఎక్కువగా ఉండటమే ప్రోత్సాహక పథకానికి దారితీసిందనే వాదనలు కూడా ఉన్నాయి.