రాజధాని లేని సీఎంకు స్వాగతం .. విశాఖలో ఫ్లెక్సీల కలకలం..  

రాజధాని లేని సీఎంకు స్వాగతం .. విశాఖలో ఫ్లెక్సీల కలకలం..  

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉత్తరాంధ్ర పర్యటనకు వెళుతున్నారు. ఈ క్రమంలో విశాఖలో ఫ్లెక్సీల కలకలం రేగింది. రాజధాని లేని రాష్ట్ర ముఖ్యమంత్రికి స్వాగతం అంటూ సెటైర్లు పేల్చారు. జన జాగరణ సమితి ఫ్లెక్సీలు కట్టి వినూత్న నిరసన వ్యక్తం చేశారని చర్చ జరుగుతోంది.  బుధవారం  ( మే3)న భోగాపురం ఎయిర్ పోర్టుకు శంకుస్థాపన చేయనున్నారు.. అలాగే విశాఖలో జరిగే కార్యక్రమాలకు హాజరవుతున్నారు. అయితే సీఎం టూర్‌కు ముందు విశాఖలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కలకలం రేపాయి. నగరంలోని మధురవాడ ఐటీ హిల్స్ దగ్గర జన జాగరణ సమితి పేరుతో జగన్‌కు వ్యతిరేకంగా ఫ్లెక్సీల ఏర్పాటు చేశారు. 

రాజధాని లేని రాష్ట్రంగా

మూడు రాజధానులంటూ జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ రాజధాని లేని రాష్ట్రంగా మారిందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామంటూ ఉన్న రాజధానిని నాశనం చేసారని... దీంతో అమరావతిని కూడా రాజధానిగా చెప్పుకునే పరిస్థితి లేదంటున్నారు. ఏపీ రాజధాని ఏదంటే రాష్ట్ర ప్రజలకు ఏం చెప్పాలో అర్ధంకావడం లేదంటూ వైసిపి ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. 

జన జాగరణ సమితి వినూత్నంగా నిరసన

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మే 3న విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో వైసీపీ ప్రభుత్వ మూడు రాజధానుల నిర్ణయంతో ఏపీ రాజధాని లేని రాష్ట్రంగా మారిందంటూ జన జాగరణ సమితి వినూత్నంగా నిరసన తెలిపేందుకు సిద్దమయ్యింది. వైసిపి ఎంపీ ఎంవివి సత్యనారాయణ ఇంటికి సీఎం జగన్ వెళ్ళే అవకాశాలుండటంతో ఆ దారిలో రాజధాని లేని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ కు స్వాగతం అంటూ ప్లెక్సీలు ఏర్పాటుచేసారు. ఇలా విశాఖలో జన జాగరణ సమితి సీఎం జగన్ పై సెటైర్లు విసురుతూ ఏర్పాటుచేసిన ప్లెక్సీలు దుమారం రేపుతున్నాయి.