జనగామ అర్బన్, వెలుగు : డిజిటల్ అరెస్ట్ చేస్తామని బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేసే సైబర్ నేరగాళ్ల మాటలు నమ్మి ఎవరూ మోసపోవద్దని జనగామ సీఐ సత్యనారాయణ రెడ్డి విద్యార్దులను హెచ్చరించారు. బుధవారం ఫ్రాడ్ కా పుల్‌స్టాప్ అవగాహన కార్యక్రమం సీపీ ఆదేశాల మేరకు సీఐ ఆధ్వర్యంలో ఏబీవీ జూనియర్ కాలేజీలో నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఐ సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ మీ వ్యక్తిగత సమాచారాన్ని పాస్వర్డ్లు, బ్యాంక్ ఖాతా వివరాలు, ఓటీపీలు ఎవరితోనూ పంచుకోవద్దని, అపరిచిత లింకులు, ఫైల్అటాచ్మెంట్లను క్లిక్ చేయవద్దని, డబ్బు బదిలీ చేయమని, నగదు తీసుకురమ్మని చెప్పే ఎలాంటి విషయాలు పట్టించుకోవద్దని సూచించారు.
ఏదైనా సైబర్ మోసానికి గురయ్యారని అనుమానం వచ్చిన వెంటనే సైబర్ క్రైం పోలీసులను, సంబంధిత అధికారులను తప్పనిసరిగా సంప్రదించాలని తెలిపారు. అనంతరం డిజిటల్ అరెస్టులు, సైబర్ క్రైంలను నమ్మవద్దని తెలిపే వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జనగామ ఎస్సై చెన్నకేశవులు, కాలేజీ లెక్చరర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
