జనగామ అర్బన్, వెలుగు: గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా పోస్టల్ బ్యాలెట్ పత్రాల పంపిణీ సరిగ్గా జరగాలని జనగామ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అన్నారు. బుధవారం పోస్టల్ బ్యాలెట్పంపిణీ, నిర్వహణ మీద అడిషనల్ కలెక్టర్ పింకేశ్ కుమార్ తో కలిసి జడ్పీ సీఈవో, డీపీవో, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఎంపీవోలతో కలెక్టర్ గూగుల్ మీట్ ద్వారా రివ్యూ చేశారు. ముందుగా పోస్టల్బ్యాలెట్పంపిణీ, నిర్వహణ తదితర అన్ని ప్రక్రియలకు సంబంధించి మాస్టర్ ట్రైనర్ రామరాజు పవర్ పాయింట్ప్రజెంటేషన్ ద్వారా అధికారులకు అవగాహన కల్పించారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మొదటి విడత పోలింగ్ జరిగే మండలాల్లో ఈ నెల 9వ తేదీ న ఎంపీడీవో ఆఫీస్లో పోస్టల్ బ్యాలెట్కోసం ఫెసిలిటేషన్ కేంద్రానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. రెవెన్యూ శాఖ అధికారి గెజిటెడ్ అధికారిగా ఫారం 17లో సంతకం చెయ్యడానికి అందుబాటులో ఉంటారన్నారు. సర్వీస్ ఓటర్లకు పోటీ చేస్తున్న అభ్యర్థుల జాబితా తయారైన తర్వాత 24 గంటల లోపు పోస్టు ద్వారా జీపీ ఎన్నికల అధికారి పంపాలన్నారు.
పోలింగ్ కు సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవాలని ఎంపీడీవో లను ఆదేశించారు. మొదటి విడత పోలింగ్ జరిగే మండలాల్లో ఈ నెల 6న పోలింగ్ అధికారులకు రెండో విడత శిక్షణ కార్యక్రమం ఉంటుందన్నారు.
