
హైదరాబాద్సిటీ, వెలుగు: జర్నలిస్టుల ఇండ్ల సమస్యలను పరిష్కరించాలని ది జర్నలిస్టు కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ పాలకవర్గం సభ్యులు బుధవారం (సెప్టెంబర్ 10) -మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు. సొసైటీ అధ్యక్షుడు బ్రహ్మాండభేరి గోపరాజు నేతృత్వంలో పలువురు నేతలు బుధవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిశారు.
ది జర్నలిస్టు కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో ఉన్న వెయ్యి మంది నాన్ అలాటీస్ జర్నలిస్టులకు ఇండ్ల నిర్మాణం కోసం స్థలం కొనుగోలు చేయడానికి జనరల్ బాడీ సమావేశంలో తీర్మానం చేశామన్నారు. ప్రస్తుతం కొంత సొసైటీ నిధులు, సభ్యుల నుంచి కొన్ని డబ్బులు సేకరించి స్థలం కోనుగోలు చేయాలని జనరల్ బాడీ తీర్మానించిన విషయాన్ని మంత్రి దృష్టికి అధ్యక్షుడు గోపరాజు తీసుకువచ్చారు.
ఈ మేరకు సొసైటీ అధికారులకు దరఖాస్తు కూడా పెట్టుకున్నామని పేర్కొన్నారు. వెయ్యిమంది నాన్ అలాటీస్ కోసం స్థలం కొనుగోలు చేసేందుకు సంబంధిత అధికారుల నుంచి అనుమతి ఇప్పించాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు.