
- ఏడాదిగా సాగుతున్న బిల్డింగ్ పనులు
- తాత్కాలిక బిల్డింగ్‌లో కొనసాగుతున్న కాలేజీ
- ప్రైవేట్ బిల్డింగ్‌లో హాస్టళ్ల నిర్వహణ
కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మెడికల్ కలేజీ బిల్డింగ్ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. పనులు ప్రారంభమై ఏడాది గడిచినా 40 శాతం కూడా పూర్తి కాలేదు. ప్రస్తుతం మాత, శిశు సంరక్షణ హాస్పిటల్ బిల్డింగ్‌లో కాలేజీ కొనసాగుతుండగా, కాలేజీకి దూరంగా అద్దె భవనంలో బాయ్స్, గర్ల్స్ హాస్టళ్లను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం 2 బ్యాచ్‌ల విద్యార్థులు ఉండగా, త్వరలో నిర్వహించే కౌన్సెలింగ్ తర్వాత 3వ బ్యాచ్ విద్యార్థులు రానున్నారు.
డిగ్రీ కాలేజీ ఆవరణలో మెడికల్ కాలేజీ కోసం 10 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. బిల్డింగ్ నిర్మాణానికి రూ. 130 కోట్లు మంజూరు చేసింది. నిర్మాణ పనులను ఆర్అండ్బీ శాఖ పర్యవేక్షిస్తోంది. కాలేజీ, హాస్పిటల్, బాయ్స్, గర్ల్స్ హాస్టల్స్, ప్రిన్సిపాల్, సూపరింటెండెంట్ క్వార్టర్స్ బిల్డింగ్‌లను నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి కల్లా పనులు పూర్తి కావాల్సి ఉంది. కొన్ని నిర్మాణాలు ఫస్ట్ స్లాబ్ కంప్లీట్ కాగా, ఇంకొన్ని బెస్మింట్, లెంటల్ లెవల్ వరకు వచ్చాయి. స్లాబ్ పడిన వాటికి గోడలు నిర్మిస్తున్నారు. గోడలతో పాటు, గ్రానైట్ వర్క్స్, కరెంట్, అంతర్గత పనులకు ఎక్కువ రోజులు పట్టనుంది.
ఇబ్బందుల్లో విద్యార్థులు..
మాత, శిశు సంరక్షణ హాస్పిటల్ కోసం నిర్మిస్తున్న కొత్త బిల్డింగ్‌లో కాలేజీ నిర్వహిస్తున్నారు. ఇది సరిపోక వెనుక భాగంలో 2 షెడ్లను నిర్మించారు. ప్రస్తుతం 2 బ్యాచ్‌ల మెడికో స్టూడెంట్స్ ఉన్నారు. ఒక్కో బ్యాచ్‌లో 100 మంది ఉన్నారు. త్వరలోనే 3వ బ్యాచ్ స్టూడెంట్స్ వస్తారు. కాలేజీ బిల్డింగ్‌కు దూరంగా అశోక్‌నగర్ కాలనీలో కిరాయి బిల్డింగ్‌లో బాయిస్, గర్ల్స్‌కు వేర్వేరుగా హాస్టళ్లను నిర్వహిస్తున్నారు. సరైన వసతులు లేకపోవడం, కాలేజీకి 2 కి.మీ. దూరం ఉండడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
టౌన్ నడిబొడ్డున ఉన్న జిల్లా హాస్పిటల్‌ను కాలేజీ అనుబంధ హాస్పిటల్‌గా మార్చారు. శిథిలావస్థకు చేరిన ఈ బిల్డింగ్‌లో ఇరుకిరుకు వార్డులు ఉన్నాయి. 300 బెడ్స్‌కు వసతి లేక పై అంతస్థుల్లో రేకుల షెడ్లు వేశారు. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ చూపి త్వరగా బిల్డింగ్‌ల నిర్మాణం పూర్తయ్యేలా చూడాల్సి ఉంది.
గడువులోగా కంప్లీట్ కు చర్యలు
కాలేజీ బిల్డింగ్ పనులు వచ్చే ఏడాది జనవరి కల్లా కంప్లీట్ కావాల్సి ఉంది. పనులను స్పీడప్ చేయిస్తున్నాం. గడువులోగా నిర్మాణ పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం.
తురాబ్, ఆర్అండ్బీ ఏఈ