- కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి
గంగాధర/రామడుగు/ కొత్తపల్లి వెలుగు: కరీంనగర్ జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. గురువారం రామడుగు మండలం వెదిర జడ్పీ హైస్కూల్, గంగాధర మండలం కురిక్యాల, గంగాధర జడ్పీ హైస్కూల్, కొత్తపల్లి మండలం బద్దిపల్లి యూపీఎస్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను ఆమె సందర్శించారు. ఓటరు జాబితాలో ఓటర్ల క్రమసంఖ్య సరిచూసుకుని ఓటింగ్ ప్రక్రియను నిర్వహించాలని ప్రిసైడింగ్ ఆఫీసర్లకు సూచించారు.
పోలింగ్ నిర్వహణ, ఏర్పాట్లను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. గ్రామ పంచాయతీల పరిధిలో ఓటర్ల సంఖ్య పోలింగ్ శాతాన్ని అడిగి తెలుసుకున్నారు. ఓటింగ్ శాతం ఎప్పటికప్పుడు నిర్దేశిత ఫార్మాట్లో నమోదు చేయాలని రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆయా మండలాల ఎంపీడీవోలు, తహశీల్దార్లు, అధికారులు ఉన్నారు.

