
- నియోజకవర్గంలో పోలీసు స్టేషన్లను సందర్శించిన కరీంనగర్ సీపీ సత్యనారాయణ
కరీంనగర్: రాష్ట్ర రాజకీయాలకు కేంద్ర బిందువుగా నిలుస్తున్న హుజూరాబాద్ నియోజకవర్గంలో సమస్యాత్మక ప్రాంతాలపై కరీంనగర్ సీపీ సత్యనారాయణ దృష్టి సారించారు. నియోజకవర్గంలో సోమవారం సుడిగాలి తనిఖీలు చేసిన ఆయన జమ్మికుంట పోలీస్ స్టేషన్ ను సందర్శించిన సందర్బంగా తనను కలసిన మీడియాతో మాట్లాడారు. హుజురాబాద్ నియోజకవర్గంలో ని జమ్మికుంట, హుజురాబాద్ ఇల్లందకుంట ,వీణవంక పోలీస్ స్టేషన్ లను సందర్శించానని, ప్రతి మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు డీఎస్పీ స్థాయి అధికారులు ఉన్నారని, శాంతి భద్రతలను కాపాడటం, ప్రజా శాంతిని భంగం కలిగించే వారి పై కఠిన చర్యలు తీసుకోవడం పోలీసులుగా తమ భాధ్యత అన్నారు.
హుజురాబాద్ లో ఉప ఎన్నికలు రాబోతున్నాయి
హుజూరాబాద్ లో త్వరలో ఉఫ ఎన్నికలు రాబోతున్నాయి, నోటిఫికేషన్ ముందు నోటిఫికేషన్ తరువాత కౌంటింగ్ తరువాత మూడు సందర్భాలలో మా పోలీస్ విధులు కీలకంగా ఉంటాయని ఈ సందర్బంగా సీపీ సత్యనారాయణ తెలిపారు. ఎక్కడా కూడా ఘర్షణ పూరితమైన వాతావరణం, వైషమ్యాలు లేదా కులమత బేధాలు లేకుండా చూడాలని పోలీసు అధికారులకు, సిబ్బందికి దిశానిర్దేశం చేస్తున్నామన్నారు. సమస్యాత్మక ప్రాంతాలు, సంశయాత్మక వ్యక్తుల పట్ల ప్రత్యేకంగా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిష్పక్షపాతంగా జరిపించడం జరుగుతుందని ఆయన భరోసా ఇచ్చారు. ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టి ఘర్షణలకు పాల్పడితే అలాంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలకు ఒక ప్రత్యేక స్థానం ఉందని, అది ఒక ఉత్కంఠ భరితంగా జరుగుతుందని ఆయన వివరించారు. ఎన్నికలలో ఇరువర్గాలు వారు సంయమనం పాటించాలని ఆయన సూచించారు. ప్రజా భద్రతకు, ప్రజా స్వామ్యానికి, శాంతి భద్రతకు, విఘాతం కలిగిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని, అలాంటి వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ సత్యానారాయణ హెచ్చరించారు.