
- ఇటీవల ఇల్లు కొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్
- తన పాత క్యాంప్ ఆఫీసును కూల్చేసి కొత్త ఆఫీస్ నిర్మించిన మంత్రి పొన్నం
- కొత్తపల్లిలో ఆఫీస్ నిర్మించిన కాంగ్రెస్ నేత వెలిచాల
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ లీడర్లు తమను కలిసేందుకు వచ్చే జనాలకు, తమకు మరింత సౌకర్యంగా ఉండేందుకు కొత్త ఆఫీసులు ఏర్పాటు చేసుకుంటున్నారు. రాష్ట్ర బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇటీవల కరీంనగర్ మంకమ్మతోట పొన్నం కాంప్లెక్స్‌లోని తన పాత క్యాంప్ ఆఫీసును కూల్చివేసి.. కొంత విస్తరించి కొత్తగా ఆఫీసు నిర్మించారు. మంత్రి కొత్త క్యాంప్ ఆఫీస్‌ను సిద్ధం చేయడంతో ఇక మీదట కరీంనగర్ రాజకీయాలపై ఆయన పూర్తిగా ఫోకస్ పెడతారనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.
అలాగే డీసీసీ అధ్యక్షుడిగా లేదా కరీంనగర్ కాంగ్రెస్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి పదవి ఆశిస్తున్న కాంగ్రెస్ పార్లమెంట్ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్ రావు కూడా ఇక తాను పూర్తి స్థాయి రాజకీయాల్లో ఉండేందుకు కొత్తపల్లిలో ‘సరళ్ జగ్ - జనహితం– వెలిచాల ప్రజా కార్యాలయం’ పేరుతో ఆఫీసు నిర్మించారు. త్వరలో దీనిని ప్రారంభించబోతున్నారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తన నివాసానికి సమీపంలో ‘మీ సేవ’ పేరిట ప్రారంభించిన ఆఫీసును మంత్రిగా ఉన్నప్పుడు కూడా కొనసాగించిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక కొన్నాళ్లుగా 'మీ సేవ' ఆఫీసును ఇతర అవసరాలకు
వినియోగిస్తున్నారు.
నెరవేరిన బండి సొంతింటి కల
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తొలిసారిగా జూన్ నెలలో కరీంనగర్‌లో ఓ ఇంటిని కొన్నారు. సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో కొనసాగుతున్న బండి సంజయ్.. కేంద్ర మంత్రి అయినప్పటికీ ఇంతకాలం తన అత్తగారి ఇంటిలోనే ఉంటున్నారు. ఈ క్రమంలోనే కరీంనగర్‌లోని ఎంపీ ఆఫీసు పక్కనున్న 2 గుంటల స్థలంలో ఉన్న పాత ఇల్లు అమ్మకానికి రావడంతో రూ.98 లక్షలు పెట్టి కొనుగోలు చేశారు.