నాలుగేండ్లు కాదు.. 40 ఏండ్లయినా  దళిత బంధు ఇయ్యడు

నాలుగేండ్లు కాదు.. 40 ఏండ్లయినా  దళిత బంధు ఇయ్యడు
  • కేసీఆర్ మరోసారి మోసం చేస్తుండు: బీజేపీ నేత ఈటల
  • అప్పులు, జీతాలు, పథకాలకు పోనూ బడ్జెట్లో ఏం మిగలయ్​
  • సాధ్యం కానీ హామీలియ్యడం ఆయనకే అలవాటని మండిపాటు

జమ్మికుంట, వెలుగు:  రాష్ట్రంలోని దళిత కుటుంబాలన్నింటికీ వచ్చే నాలుగేండ్లలో దళిత బంధు ఇస్తానని సీఎం కేసీఆర్ మరోసారి మోసానికి సిద్ధపడుతున్నాడని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ మండిపడ్డారు. నాలుగేండ్లు కాదు 40 ఏండ్లయినా దళిత బిడ్డలకు ఇచ్చేందుకు ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేవని చెప్పారు. జమ్మికుంట పట్టణంలో బీజేపీ కార్యాలయంలో జరిగిన దళిత ఆత్మీయ, సత్కార సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తాను ఆర్థిక మంత్రిగా చేసిన కాబట్టి బడ్జెట్ గురించి అన్ని తెలుసన్నారు. ప్రతి ఏడాది 60 వేల కోట్లు అప్పులకు, 15 వేల కోట్లు రైతుబంధుకు, 40 వేల కోట్లు ఉద్యోగుల జీతాలకు, 15 వేల కోట్లు కరెంటు, బియ్యం ఇతర సబ్సిడీలకు.. ఇవన్నీ పోగా బడ్జెట్లో ఇక మిగిలేది ఎంత అని ప్రశ్నించారు. ఆఖరికి కోర్టులో కేసు వేయించి కేసీఆరే పథకం ఆపిస్తారన్నారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని అన్నప్పుడే రాష్ట్రంలో పంచేందుకు భూములు లేవని ముఖ్యమంత్రికి చెప్పానని తెలిపారు. రాష్ట్రంలో పేద దళితులు 15 లక్షల మంది ఉన్నారని.. వారికి భూములు ఇవ్వాలంటే 45 లక్షల ఎకరాల భూమి కావాలని చెప్తే పట్టించుకోలేదన్నారు. సాధ్యం కానీ హామీలిచ్చి మాట తప్పడం కేసీఆర్ కు అలవాటేనని దుయ్యబట్టారు.  
మీ నియోజక వర్గాల్లో ఇప్పించే దమ్ముందా?
హుజూరాబాద్ లో తనను ఓడించేందుకు తిరుగుతున్న ఎమ్మెల్యే, మంత్రులకు వారి సొంత నియోజకవర్గాల్లో దళిత బంధు, పెన్షన్లు, రేషన్ కార్డులు ఇప్పించే దమ్ముందా అని ఈటల ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఆదేశించారని బానిసల్లాగా పనిచేస్తున్న నాయకులు, అధికారులు, పోలీసులకు ఏదో ఒకనాడు తన లాంటి పరిస్థితి రావచ్చని.. అప్పుడు తమ సంగతి ఏంటో తెలుసుకోవాలని హితవు పలికారు. ముఖ్యమంత్రి తన బొండిగ పిసికేందుకే దళిత బంధు పథకం తెచ్చారని.. అయినా రూ.10 లక్షలు దళితులకు వస్తాయన్న నమ్మకం లేదన్నారు. ఒకవేళ వచ్చినా దానికి కారణం తానే అని గుర్తుంచుకోవాలని ఆయన కోరారు. ఈటలకు దళితులు సన్మానం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, ఎస్సీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మేడి రమణ, మాదిగ హక్కుల దండోరా నేత సునీల్, మాల మహానాడు నాయకుడు శీలం శ్రీనివాస్, మాదిగ హక్కుల దండోరా జాతీయ అధ్యక్షుడు దండు సురేందర్ పాల్గొన్నారు.