కేసీఆర్ మాటంటే మాటే.. అందరికీ దళితబంధు వస్తది

 కేసీఆర్ మాటంటే మాటే.. అందరికీ దళితబంధు వస్తది
  • హుజూరాబాద్ సిర్సపల్లిలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు 

హుజూరాబాద్: సీఎం కేసీఆర్ మాటంటే.. మాటే.. అందరికీ దళితబంధు వస్తది అని రాష్ట్ర ఆర్ధిక మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం సిర్సపల్లిలో ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. హుజూరాబాద్ లో కాంగ్రెసు పార్టీ లేదని కేవలం టీఆర్ఎస్ , బీజేపీ పోటీలో ఉన్నాయన్నారు. 
రైతుబంధు దండగ అన్న బీజేపీ నేత ఈటల రాజేందర్.. తాను మాత్రం రైతు బంధు డబ్బులు తీసుకున్నారని ఆరోపించారు. రైతులకు  ఏడాదికి ఎకరానికి పది వేలు ఇచ్చిన ఏకైక సీఎం కేసీఆర్ అని ఆయన ప్రశంసించారు. రైతుల దగ్గర పన్నులు వసూలు చేసే ప్రభుత్వాలు ఉన్నాయి కాని రైతుకే  డబ్బులు ఇచ్చిన వ్యక్తి కేసీఆర్ అని కొనియాడారు. వడ్లను కొనమని కేంద్రం లేఖ రాసింది.. కానీ సీఎం కేసీఆర్ రైతుల వడ్లు కొనేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బావుల‌ దగ్గర మీటర్లు పెట్టమంటోందని, బీజేపీ నిన్న బతుకమ్మ పండుగకు గిఫ్ట్ గా గ్యాస్ సిలిండర్ థర వేయి రూపాయలు దాటించారని, సబ్సిడీని ఎగబెట్టారని ఆరోపించారు. దళితబంధు ఇస్తామంటే ఈటల‌ రాజేందర్, బీజేపీ నేతలు తమ జూటా మాటలతో గందరగోళం చేస్తున్నారని, దళిత బంధు పైసలు రావు అని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దళిత బంధు డబ్బులు మీ అక్కౌంట్ లలోనే ఉంటాయని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలోని దళితులందరికీ  దళితబంధు ఇస్తామని సీఎం‌ చెప్పారని, కేసీఆర్ మాటంటే మాట అని ఆయన పేర్కొన్నారు.