- ఏడేండ్ల తర్వాత పంచాయతీ ఎన్నికలు.. సత్తాచాటిన పార్టీలు
- ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంతో ప్రజలకు చేరువైన ప్రజా ప్రభుత్వం
- ఎయిర్ పోర్టు నిర్మాణానికి ముందడుగు
- నార్నూర్ బ్లాక్‌కు జాతీయ స్థాయి అవార్డులతో జిల్లాకు ఖ్యాతి
ఆదిలాబాద్, వెలుగు: నేటితో 2025 ముగియనుంది.. రేపటి నుంచి కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. కాగా ఉమ్మడి జిల్లా ప్రజలకు ఈ ఏడాది కొంచెం ఇష్టం.. కొంచెం అన్నట్లుగా సాగింది. భారీ వర్షాలు, వరదలతో రైతులకు కష్టకాలం సాగింది. రోడ్డు బాధిత కుటుంబాలకు చేదు అనుభవం మిగిలింది. ఇదిలాఉంటే ప్రభుత్వ పథకాలతో జిల్లా అభివృద్ధికి బీజం పడింది. పెద్ద ప్రాజెక్టుల ఏర్పాటుకు మార్గం సుగమమైంది. పంచాయతీ ఎన్నికలతో రాజకీయ నేతల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.
ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా ప్రజల చిరకాల కోరిక ఎయిర్ పోర్టు నిర్మాణానికి ప్రభుత్వం 700 ఎకరాల భూ సేకరణ కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రజా ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఈ ఏడాది శ్రీకారం చుట్టారు. జిల్లాలో 2132 ఇండ్లు మంజూరయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాలో రూ.500 కోట్ల అభివృద్ధి పనులు ఒకేసారి ప్రారంభించారు. వెనుకబడిన ఆదిలాబాద్‌కు పలు విభాగాల్లో ఈసారి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. నార్నూర్ బ్లాక్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు రావడంతో పలు అవార్డులు వరించాయి. భూకబ్జాదారులపై ఎస్పీ ఉక్కుపాదం మోపారు. పెద్ద ఎత్తున్న భూకబ్జాదారులను అరెస్టు చేయించారు.
పంచాయతీ ఎన్నికలతో రాజకీయాల్లో జోష్..
2023 అసెంబ్లీ, 2024 పార్లమెంట్ ఎన్నికలతో రాజకీయాల్లో ఫుల్ జోష్ కనిపించింది. డిసెంబర్ లో జరిగిన పంచాయతీ ఎన్నికలు కిక్ ఇచ్చాయి. సర్పంచ్ల పదవీకాలం ముగిసి రెండేళ్లు గడుస్తున్నా ఎన్నికలు నిర్వహిస్తారో లేదోనని నిరాశ చెందారు. కానీ మూడు విడతలుగా జిల్లాలో ఎన్నికలు నిర్వహించారు. మొత్తం 473 గ్రామ పంచాయతీల్లో అధికార కాంగ్రెస్ సగం స్థానాలు గెలుచుకొని సత్తాచాటింది. కొన్నేండ్లుగా పెండింగ్‌లోఉన్న డీసీసీ అధ్యక్షులను నియమించారు.
నిర్మల్ జిల్లాలో...
నిర్మల్ జిల్లాకు 2025 అంతగా కలిసి రాలేదని చెప్పవచ్చు. రైతులకు ఉపయోగపడే ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఇప్పటివరకు సందిగ్ధంలోనే కొట్టుమిట్టాడుతోంది. ఈ సంవత్సరం భారీ వరదలు జిల్లాకు కష్టం చేకూర్చాయి. ఎస్పీ జానకీ షర్మిల ఆధ్వర్యంలో ఏర్పాటైన శివంగి టీం, పోలీస్ అక్క కార్యాచరణ రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందింది. శక్తి కార్యక్రమానికి సైతం గుర్తింపు లభించింది.
భైంసా కేంద్రంగా సాగిన ఆన్లైన్ బెట్టింగ్ వ్యాపారానికి పోలీసులు చెక్ పెట్టి రూ.కోటిన్నర విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగిన శ్రీహరిరావును తప్పించి ఆయన స్థానంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జును నియమించారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీగా తలపడ్డాయి. బీఆర్ఎస్ ఇప్పటికీ కోలుకోలేదు.
కాంగ్రెస్‌లో జోష్
2025 సంవత్సరం మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చింది. చెన్నూరు ఎమ్మెల్యే జి.వివేక్ వెంకటస్వామిని మంత్రి పదవి వివరించింది. జూన్ 11న ఆయనకు లేబర్, మైనింగ్, ఎంప్లాయిమెంట్, ట్రైనింగ్, ఫ్యాక్టరీస్ శాఖలను కేటాయించారు. జూన్ 12న మెదక్ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రిగా నియమితులయ్యారు. అలాగే ఏడాది డిసెంబర్లో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలను హస్తగతం చేసుకుంది.
302 పంచాయతీల్లో కాంగ్రెస్ రెబల్స్ తో కలిపి ఏకంగా 224 సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకుంది. అయితే అకాల వర్షాలతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో కురిసిన భారీ వర్షాలతో అన్నదాతలు అతలాకుతలమయ్యారు. జిల్లావ్యాప్తంగా 54 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి.
ఆదిలాబాద్‌లో18,370 ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు
ఈ ఏడాది రైతన్నకు కన్నీళ్లే మిగిలాయి. భారీ వర్షాలతో పాటు అకాల వర్షాల కారణంగా పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. భారీ వర్షాల కారణంగా ఆదిలాబాద్జిల్లాలో18,370 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. అత్యధికంగా పత్తి 10 వేల ఎకరాల్లో నష్టపోగా భారీస్థాయిలో సోయా, మొక్క జొన్న పంటలు నీట మునిగాయి. పత్తి పూత, కాయ దశలో మంథా తుఫాన్ ఎఫెక్ట్ తో వర్షాలు కురవడంతో దిగుబడులపై తీవ్ర ప్రభావం పడింది. ఫలితంగా ఈ సారి రైతులుకు పెట్టుబడి ఖర్చులు కూడా రాలేదు. దీంతో పంట నష్టం, అప్పుల భాదతో జిల్లాలో 27 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.
