- నేడు గిగ్ వర్కర్ల సమ్మె
- చార్జీల తగ్గింపు, 10 నిమిషాల డెలివరీ ఒత్తిళ్లపై ఆందోళన
- పాల్గొననున్న స్విగ్గీ, జొమాటో, అమెజాన్, ఫ్లిప్కార్ట్ కార్మికులు
- మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు సేవలు బంద్
హైదరాబాద్, వెలుగు: దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా రాష్ట్రంలో గిగ్ వర్కర్లు బుధవారం మెరుపు సమ్మెకు దిగనున్నారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు బంద్ పాటించనున్నారు. ఆ సమయంలో ఎలాంటి ఆర్డర్లు తీసుకోబోమని, డెలివరీలు ఉండవని గిగ్వర్కర్లఅసోసియేషన్ల నేతలు ప్రకటించారు. అదే సమయంలో రోడ్ల మీదకు వచ్చి నినాదాలు చేయడం, ర్యాలీలు చేయడం లాంటివి చేయబోమని తెలిపారు. దేశవ్యాప్తంగా లక్షన్నర మంది ఈ సమ్మెలో పాల్గొంటున్నారని వెల్లడించారు.
గిగ్ వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలను యాజమాన్యాలు, ప్రభుత్వం, ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకే ఈ సమ్మెకు దిగుతున్నామని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే జోక్యం చేసుకుని తమకు చట్టపరమైన రక్షణ కల్పించాలని, గిగ్ వర్కర్లు ఎక్కువగా పనిచేస్తున్న స్విగ్గీ, జొమాటో, ఓలా, ఉబెర్, ఫ్లిప్ కార్ట్ కంపెనీలతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.
కాగా.. ఈ నెల 25న ఫ్లాష్ స్ట్రైక్ పేరుతో సమ్మె చేసిన గిగ్ వర్కర్లు.. దానికి కొనసాగింపుగా బుధవారం మెరుపు సమ్మెకు దిగుతున్నారు. 25న దేశవ్యాప్తంగా దాదాపు 40 వేల మంది గిగ్వర్కర్లు సమ్మె చేయడంతో చాలా నగరాల్లో 60 శాతం డెలివరీలు ఆలస్యం అయ్యాయి. దీంతో కంపెనీలపై సోషల్ మీడియాలో కస్టమర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దెబ్బకు స్టాక్ మార్కెట్ లో స్విగ్గీ షేర్ 2 శాతం పడిపోయింది.
ఇవీ సమస్యలు
కంపెనీల నుంచి వర్కర్లకు ఎదురవుతున్న సమస్యలు, పనిఒత్తిడి, వేధింపులతో ఆందోళనకు దిగుతున్నారు. ముఖ్యంగా డెలివరీ చార్జీలు తగ్గించడం, ఎంత దూరం ఉన్నా 10 నిమిషాల్లో డెలివరీ చేయాలనే టార్గెట్ విధించడం, వర్కర్ల ఐడీలు బ్లాక్ చేయడం వంటి సమస్యలు ఉన్నాయని వర్కర్లు చెబుతున్నారు. కష్టపడినా అందుకు తగ్గ ప్రతిఫలం దక్కడం లేదని వాపోతున్నారు.
నేడు డెలివరీలపై భారీగా ప్రభావం !
రాష్ట్రంలో 4.2 లక్షల మంది గిగ్ వర్కర్లు పనిచేస్తున్నారని కార్మిక శాఖ అధికారులు చెబుతున్నారు. డిసెంబర్ 31 సందర్భంగా దేశవ్యాప్తంగా కోట్లలో కంపెనీలకు ఆర్డర్లు రానున్నాయి. ఇపుడు వర్కర్ల ఆందోళనతో ఆర్డర్లు లేట్ కావడంతో పాటు స్విగ్గీ, జొమాటో, అమెజాన్, ఫ్లిఫ్ కార్ట్ కు భారీగా నష్టం వాటిల్లనుందని అంచనా వేస్తున్నారు.
వర్కర్లపై వేధింపులు పెరుగుతున్నాయి: డెలివరీ కార్మికులు తమ హక్కుల కోసం గొంతు విప్పితే, కంపెనీలు ఐడీ బ్లాకింగ్, బెదిరింపులకు పాల్పడుతున్నాయి. డెలివరీ కార్మికులు బానిసలు కాదు. గౌరవం, సామాజిక భద్రత లేకుండా ఏ వర్కర్ కూడా పనిచేయలేడు. కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని కంపెనీలతో చర్చలు జరపాలి.
షేక్ సలావుద్దీన్, వ్యవస్థాపక ప్రెసిడెంట్ గిగ్ ప్లాట్‌ఫాం వర్కర్స్ యూనియన్
