ఎమ్మెల్యే దానంకు స్పీకర్ నోటీసు

ఎమ్మెల్యే దానంకు స్పీకర్ నోటీసు
  • ఈ నెల 30న విచారణకు రావాలని ఆదేశం
  • బీఆర్ఎస్ ఇచ్చిన అనర్హత పిటిషన్​ను కొట్టేయాలంటూ స్పీకర్​కు దానం అఫిడవిట్ 
  • 2024లో వ్యక్తిగత హోదాలో కాంగ్రెస్ సమావేశానికి వెళ్లానని అందులో దానం వివరణ 

హైదరాబాద్, వెలుగు: ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ను ఈ నెల 30న విచారణకు హాజరుకావాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ బుధవారం నోటీసులు పంపించారు. శుక్రవారం ఉదయం 10. 30 గంటలకు అసెంబ్లీలోని ట్రిబ్యునల్ ఆఫీసులో జరిగే ఈ విచారణకు హాజరుకావాలన్నారు. దానం బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారని, ఆయనపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ల ఆధారంగా ఈ విచారణ సాగనుంది.

స్పీకర్ ఇచ్చిన నోటీసుపై దానం స్పందిస్తూ అఫిడవిట్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ పార్టీకి తాను రాజీనామా చేయలేదని, ఆ పార్టీ తనను సస్పెండ్ చేయలేదని, అయితే 2024 మార్చిలో కాంగ్రెస్ సమావేశానికి వెళ్లానని, అది కూడా వ్యక్తిగత హోదాలో వెళ్లానని అందులో దానం స్పీకర్​కు వివరణ ఇచ్చారు. మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా తాను పార్టీ మారినట్లు బీఆర్ఎస్ భావిస్తుందని, ఆ పార్టీ తనపై వేసిన అనర్హత పిటిషన్ ఆధారంగానే తాను ఈ వివరణ ఇస్తున్నట్లు చెప్పారు. గతంలో కోర్టు ఇచ్చిన తీర్పుల ఆధారంగా తనపై బీఆర్ఎస్ వేసిన అనర్హత పిటిషన్ చెల్లుబాటు కాదని, దీన్ని కొట్టివేయాలంటూ ఆయన ఆ అఫిడవిట్​లో స్పీకర్​ను కోరారు.