- కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
ఖమ్మం, వెలుగు: జిల్లాలో అన్ని ఎంపీడీవో ఆఫీస్ల వద్ద పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేశామని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికలు ముగిసే వరకూ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉంటుందన్నారు. ఎన్నికల కమిషన్ సూచనల మేరకు ఎన్నికల విధులు నిర్వహించేవారికి, అత్యవసర సేవల్లో పనిచేసే ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించినట్లు పేర్కొన్నారు.
మొదటి విడత పంచాయతీ ఎన్నికలు జరిగే కొణిజెర్ల, రఘునాథపాలెం, వైరా, బోనకల్, చింతకాని, మధిర, ఎర్రుపాలెం మండలాల్లో ఈ నెల5 నుంచి 10 వరకు, రెండో విడత ఎన్నికలు జరిగే కామేపల్లి, ఖమ్మం రూరల్, కూసుమంచి, ముదిగొండ, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం మండలాల్లో ఈ నెల 8 నుంచి 13 వరకు, మూడో విడత ఎన్నికలు జరిగే ఏన్కూర్, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, తల్లాడ, వేంసూర్, సింగరేణి మండలాల్లో ఈ నెల 11 నుంచి 16 వరకు సంబంధిత మండలాల ఎంపీడీవో కార్యాలయాల వద్ద ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పోస్టల్ బ్యాలెట్సౌకర్యం కల్పించేందుకు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.
