- అడిషనల్ కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి
ఖమ్మం టౌన్, వెలుగు : గెలుపోటములను క్రీడాకారులు సమానంగా స్వీకరించాలని అడిషనల్ కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి సూచించారు. వైరా స్థానిక టీజీఎస్ డబ్ల్యూఆర్ఎస్ జూనియర్ కళాశాల (బాలికలు)లో నిర్వహించిన11వ జోనల్ స్థాయి క్రీడాపోటీలు శనివారం ముగిశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అడిషనల్కలెక్టర్ హాజరై మాట్లాడారు. విజయం సాధించాలనే తపన ప్రతిఒక్కరిలో ఉండాలని, అపజయంలోనూ ధైర్యంగా ఉండాలని చెప్పారు.
జీవితంలో దేనికి భయపడొద్దని, ధైర్యంగా ముందుకు సాగాలన్నారు. లక్ష్య సాధనలో కృషి, పట్టుదల ఎంతో ముఖ్యమని వివరించారు. క్రీడలను విజయవంతంగా నిర్వహించిన ప్రిన్సిపాల్, ఫిజికల్ డైరెక్టర్, పీఈటీలు, స్కూల్ టీమ్ కృషిని అభినందించారు. అనంతరం అండర్-14, 17, 19 విభాగాల్లో గెలిచిన విజేతలు, రన్నర్ అప్స్‌కు బహుమతుల ప్రదానం చేశారు. మల్టీ జోనల్ అధికారి కె.అలివేలు, డీసీవో ఎం.రాజ్యలక్ష్మి, స్కూల్ ప్రిన్సిపాల్ డాక్టర్ డి. సమత, అధికారులు పాల్గొన్నారు.
48 గంటల్లో గన్ని సంచుల సరఫరా..
ఖమ్మం టౌన్, వెలుగు : ప్రతిపాదనలు పంపిన 48 గంటల్లోపు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు గన్ని సంచులు సరఫరా చేస్తున్నామని అడిషనల్ కలెక్టర్ పి.శ్రీనివాస రెడ్డి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ (2025 ) ధాన్యం కొనుగోలుకు సంబంధించి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద అవసరమైన మేర గన్ని సంచులు, టార్ఫాలిన్ కవర్లు అందుబాటులో ఉన్నాయని వివరించారు. కొనుగోలు కేంద్రాలకు ఇప్పటివరకు 9,71,500 గన్ని సంచులు పంపిణీ చేశామని తెలిపారు.
