- దంచికొట్టిన రింకూ సింగ్.. సత్తా చాటిన బౌలర్లు
ఈ సీజన్‌లో తొలిసారి సూపర్ ఓవర్‌కు దారితీసిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. రెండు జట్లు కూడా 20 ఓవర్లలో 155 రన్స్ చేయడంతో మ్యాచ్ టై అయింది. సూపర్ ఓవర్లో లక్నో కేవలం ఒక్క రన్ చేసి రెండు వికెట్లు కోల్పోయింది. తర్వాత కోల్‌కతా ఫస్ట్ బాల్‌కే ఫోర్ కొట్టి గెలిచింది.
లక్నో: ఐపీఎల్19లో చివరి రెండు స్థానాల్లో ఉన్న జట్ల మధ్య పోరులో లక్నో సూపర్ జెయింట్స్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్‌దే పైచేయి అయింది. ఈ సీజన్‌లో తొలిసారి సూపర్ ఓవర్‌కు దారితీసిన మ్యాచ్‌లో లక్నోను ఓడించి లీగ్‌లో రెండో విజయం అందుకుంది. ఆదివారం రాత్రి జరిగిన లో స్కోరింగ్ థ్రిల్లర్‌లో రింకూ సింగ్ (51 బాల్స్‌లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 83 నాటౌట్) రఫ్ఫాటతో తొలుత కోల్‌కతా 20 ఓవర్లలో 155/7 స్కోరు చేసింది. మోసిన్ ఖాన్ (5/23) ఐదు వికెట్లతో విజృంభించాడు. అనంతరం కెప్టెన్ రిషబ్ పంత్ (38 బాల్స్‌లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 42), ఐడెన్ మార్‌క్రమ్ (31) పోరాడినా లక్నో కూడా 20 ఓవర్లలో 155/8 స్కోరు చేసింది.
వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా చెరో రెండు వికెట్లు తీశారు. విన్నర్‌ను నిర్ణయించేందుకు నిర్వహించిన సూపర్ ఓవర్లో బ్యాటింగ్‌కు వచ్చిన లక్నో .. సునీల్ నరైన్ బౌలింగ్‌లో ఫస్ట్ బాల్‌కే నికోలస్ పూరన్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. రెండో బాల్‌కు పంత్ సింగిల్ తీశాడు. మూడో బాల్‌కు మార్‌క్రమ్ భారీ షాట్ ఆడగా.. బౌండరీ లైన్ వద్ద పావెల్ క్యాచ్ అందుకొని రోప్స్ దాటే టైమ్‌కు పక్కనే ఉన్న రింకూకు బాల్ అందించడంతో ఒక్క రన్‌కే లక్నో ఇన్నింగ్స్ ముగిసింది. ఆపై ప్రిన్స్ యాదవ్ తొలి బాల్‌కే ఫో ర్ కొట్టిన రింకూ కేకేఆర్‌ను గెలిపించాడు. అతనికే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
మోసిన్ పాంచ్ పటాకా.. రింకూ రఫ్ఫాట..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్ ఇన్నింగ్స్ 18వ ఓవర్‌కూ చాలా చప్పగా సాగింది. చివర్లో రింకూ సింగ్ విధ్వంసకర బ్యాటింగ్‌తో కేకేఆర్ గౌరవప్రద స్కోరు చేసింది. తొలుత మోసిన్ ఖాన్ ఐదు వికెట్లతో ఆ జట్టు నడ్డి విరిచాడు. రెండో ఓవర్లో టిమ్ సిఫర్ట్ (0)ను డకౌట్ చేసి తొలి దెబ్బ కొట్టిన మోసిన్.. పేలవ ఫామ్ కొనసాగించిన కెప్టెన్ అజింక్యా రహానె (10)ను తన మరుసటి ఓవర్లో పెవిలియన్ చేర్చాడు. ఆ వెంటనే అంగ్‌క్రిష్ రఘువంశీ (9) ఫీల్డింగ్‌కు అడ్డుపడి ఔటవగా పవర్ ప్లేలో కేకేఆర్ 31 రన్స్ మాత్రమే చేసింది. మళ్లీ బౌలింగ్‌కు దిగిన మోసిన్ దెబ్బకు పావెల్ (1) కీపర్‌కు క్యాచ్ ఇవ్వడంతో ఆ టీమ్ 31/4తో పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ టైమ్‌లో రింకూ సింగ్ తోడుగా కామెరాన్ గ్రీన్ (34) జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. స్పిన్నర్ జార్జ్ లిండే వేసిన 9వ ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు కొట్టి ఇన్నింగ్స్‌కు చలనం తెచ్చాడు.
మోసిన్ వేసిన 11వ ఓవర్లో మరో సిక్స్‌తో గ్రీన్ ఊపు మీద కనిపించాడు. కానీ, అదే ఓవర్ చివరి రెండు బాల్స్‌కు గ్రీన్‌తో పాటు అనుకూల్ రాయ్ (0)ను పెవిలియన్ చేర్చిన మోసిన ఐదు వికెట్లు ఖాతాలో వేసుకోగా.. కేకేఆర్ 73/6తో పూర్తిగా డీలా పడింది. రింకూ పోరాడుతున్నా మరో ఎండ్‌లో ఇబ్బంది పడిన రమణ్‌దీప్ (6) ఏడో వికెట్‌గా వెనుదిరిగాడు. నరైన్ (4 నాటౌట్) కూడా హిట్టింగ్ చేయలేకపోవడంతో కేకేఆర్ 130 స్కోరు చేస్తే గొప్పే అనిపించింది. కానీ, చివరి రెండు ఓవర్లలో రింకూ అనూహ్యంగా రెచ్చిపోయాడు. షమీ బౌలింగ్‌లో వరుసగా 6, 4, 4 కొట్టి ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. స్పిన్నర్ దిగ్వేశ్ వేసిన లాస్ట్ ఓవర్లో రింకూ వరుసగా నాలుగు సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించడంతో కేకేఆర్ స్కోరు 150 దాటింది.
లాస్ట్ బాల్‌కు షమీ సిక్స్
చిన్న టార్గెట్ ఛేజింగ్‌లో లక్నో కూడా నెమ్మదిగా బ్యాటింగ్ చేసింది. వైభవ్ అరోరా వేసిన రెండో ఓవర్ తొలి బాల్‌కు మిడాన్‌లో పావెల్ పట్టిన అద్భుత క్యాచ్‌కు ఓపెనర్ మిచెల్ మార్ష్ (2) ఔటయ్యాడు. వన్‌డౌన్‌లో వచ్చిన రిషబ్ పంత్, మరో ఓపెనర్ ఐడెన్ మార్‌క్రమ్ స్వేచ్ఛగా షాట్లు ఆడలేకపోయారు. కేకేఆర్ బౌలర్లు కట్టుదిట్టమైన బాల్స్ వేసి రన్స్ నియంత్రించారు. పంత్, మార్‌క్రమ్ స్ట్రయిక్ రొటేట్‌కే ప్రాధాన్యత ఇవ్వడంతో పవర్ ప్లేలో 37/1తో నిలిచిన లక్నో సగం ఓవర్లకు 63 రన్స్ మాత్రమే చేసింది.
గ్రీన్ వేసిన11వ ఓవర్లో భారీ షాట్‌కు ప్రయత్నించిన మార్‌క్రమ్.. బౌండరీ లైన్ వద్ద రింకూ పట్టిన మంచి క్యాచ్‌కు వెనుదిరిగాడు. దాంతో రెండో వికెట్‌కు 65 రన్స్ పార్ట్‌నర్‌షిప్ బ్రేక్ అయింది. సాధించాల్సిన రన్ రేట్ పెరగడంతో కెప్టెన్ పంత్ తన మార్కు వెరైటీ షాట్లతో ఫోర్లు కొట్టి ఛేజింగ్‌కు ఊపు తెచ్చే ప్రయత్నం చేశాడు. కానీ , నరైన్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్ ఆడబోయి కీపర్‌కు క్యాచ్ ఇవ్వడంతో ఆ టీమ్ 78/3తో డీలా పడింది. ఆ వెంటనే చక్రవర్తి బౌలింగ్‌లో సిక్స్ కొట్టిన హిట్టర్ నికోలస్ పూరన్ (9) మరో షాట్‌కు ట్రై చేసి నరైన్‌కు క్యాచ్ ఇచ్చాడు.
15వ ఓవర్లో నరైన్ 3 రన్సే ఇవ్వగా... అనుకూల్ బౌలింగ్‌లో యంగ్ హిట్టర్ ముకుల్ చౌదరి (1) కూడా వెనుదిరగడంతో 92/5తో లక్నో కష్టాలు మరింత పెరిగాయి. సాధించాల్సిన రన్‌రేట్ 13కు చేరుకోవడంతో ఆ టీమ్‌లో టెన్షన్ రేగింది. కానీ, అనుకూల్ బౌలింగ్‌లో ఆయుష్ బదోని (24) సిక్స్ కొట్టాడు. కార్తీక్ త్యాగి వేసిన తర్వాతి ఓవర్లో ఇంపాక్ట్ ప్లేయర్ హిమ్మత్ సింగ్ (19), బదోని చెరో సిక్స్ సహా 14 రన్స్ రాబట్టి లక్నోను మళ్లీ రేసులోకి తెచ్చారు. చివరి 18 బాల్స్‌లో ఆ జట్టుకు 38 రన్స్ అవసరం అయ్యాయి.
చక్రవర్తి బౌలింగ్‌లో బదోని ఔటైనా.. జార్జ్ లిండే (8 ) వరుసగా రెండు ఫోర్లు కొట్టి జట్టును రేసులో నిలిపాడు. 19వ ఓవర్లో లిండేను వైభవ్ అరోరా పెవిలియన్ చేర్చినా షమీ (11 నాటౌట్), హిమ్మత్ చెరో ఫోర్ రాబట్టడంతో సమీకరణం 6 బాల్స్‌లో 17 రన్స్‌గా మారింది. ఉత్కంఠగా సాగిన లాస్ట్ ఓవర్లో కార్తీక్ త్యాగి వరుసగా రెండు నో బాల్స్, ఫోర్ ఇచ్చిన తర్వాత హిమ్మత్‌ను ఔట్ చేశాడు. నాలుగో బాల్‌కు సింగిల్ రాగా.. ఐదో బాల్ డాట్ అయింది. కానీ, లాస్ట్ బాల్‌కు సిక్స్ కొట్టి స్కోరు సమం చేసిన షమీ మ్యాచ్‌ను సూపర్ ఓవర్‌కు తీసుకెళ్లాడు.
సంక్షిప్త స్కోర్లు
- కోల్‌కతా: 20 ఓవర్లలో 155/7 (రింకూ సింగ్ 83 నాటౌట్, గ్రీన్ 34, మోసిన్ ఖాన్ 5/23)
- లక్నో: 20 ఓవర్లలో 155/7 (పంత్ 42, మార్‌క్రమ్ 31, వైభవ్ 2/24, చక్రవర్తి 2/33)
ఫీల్డింగ్‌కు అడ్డొచ్చి రఘువంశీ ఔట్
కేకేఆర్ ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో అంగ్‌క్రిష్ రఘువంశీ ఫీల్డింగ్‌కు అడ్డుపడి (అబ్‌స్ట్రక్టింగ్ ద ఫీల్డ్) ఔటయ్యాడు. ఓవర్ ఆఖరి బాల్ ఆడిన రఘువంశీ రన్ కోసం ప్రయత్నించి మళ్లీ వెనక్కి తిరిగాడు. ఈ క్రమంలో షమీ విసిరిన త్రో నేరుగా రఘువంశీ శరీరానికి తగిలింది. రివ్యూలో బ్యాటర్ ఉద్దేశపూర్వకంగానే బాల్‌కు అడ్డంగా వచ్చాడని గుర్తించిన థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. దాంతో ఐపీఎల్లో ఈ విధంగా ఔటైన నాలుగో ప్లేయర్‌గా రఘువంశీ నిలిచాడు.

