
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ నుంచి అభ్యర్థులకు టికెట్ ఇచ్చే విషయంలో ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌ను పార్టీ పెద్దలు విధిగా పాటించాలని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి అన్నారు. అభ్యర్థుల ఎంపికపై గురువారం ఆయన పార్టీ పెద్దలకు 9 సూచనలను చేశారు. టికెట్ కేటాయింపునకు ఉదయ్‌పూర్ డిక్లరేషన్ ఫార్ములాను ఫాలో కావాలని, దాని ప్రకారమే టికెట్లు ఇవ్వాలని పేర్కొన్నారు. ః
ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప ఇతర పార్టీల నుంచి వచ్చిన అభ్యర్థులకు టికెట్లు ఇవ్వరాదని రాహుల్ గాంధీ గతంలో అన్నారని గుర్తుచేశారు. గత ఎన్నికల్లో వేరే పార్టీల్లో పోటీ చేసిన వారికి కాంగ్రెస్ టికెట్లు ఇవ్వకూడదని చెప్పారు. తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ శాఖకు కనీసం మూడు టికెట్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఏండ్ల తరబడి పార్టీని నమ్ముకుని ఉన్న కార్యకర్తలకు.. యువతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. మూడుసార్లు లేదా అంతకన్నా ఎక్కువసార్లు ఓడిపోయిన వారికి టికెట్లు అస్సలు ఇవ్వకూడదని సూచించారు.