
- ఎల్లంపల్లి ప్రాజెక్టు 40 గేట్లు ఎత్తి 8లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల
- గోదావరి నది ఉప్పొంగడంతో నీటమునిగిన రామగుండం లారీ అసోసియేషన్ యార్డు
- సాయంత్రానికి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం
పెద్దపల్లి జిల్లాలో గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. భారీ వర్షాలు, పైప్రాంతాల నుంచి భారీగా వచ్చిన వరద నీటితో గోదావరి నది ఉప్పొంగి బీభత్సం సృష్టిస్తోంది. గురువారం (ఆగస్టు 28)రామగుండం పరిసర ప్రాంతాలు వరద నీటిలో మునిగాయి. గోదావరిఖనిలో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో శ్రీపాదం ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టుకు వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు వదులుతున్నారు అధికారులు.
ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటిమట్టం పెరగడంతో అధికారులు 40 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సుమారు 8 లక్షల క్యూసెక్కుల వరద నీటిని గోదావరిలోకి విడిచిపెట్టారు. దీంతో దిగువ ప్రాంతాలు మరింతగా ప్రభావితం అవుతున్నాయి. గోదావరి నది తీరప్రాంత గ్రామాలను అలెర్ట్ చేశారు అధికారులు.
►ALSO READ | హవేలీ ఘనపూర్ దగ్గర బ్రిడ్జీలు తెగి స్తంభించిన జనజీవనం..
భారీవర్షాలు వరదల కారణంగా గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో రామగుండం లారీ అసోసియేషన్ యార్డులోకి వరద ప్రవాహం పోటెత్తింది. దీంతో యార్డులో నీరు చేరడంతో లారీలు నీటమునిగాయి. క్రేన్ల సహాయంతో వాటిని బయటికి తీస్తున్నారు యజమానులు.
మరోవైపు వాతావరణ శాఖ అంచనాల ప్రకారం సాయంత్రానికి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో ఎల్లంపల్లి నుంచి దిగువకు నీటిని ఇంకా ఎక్కువగా విడుదల చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రజలు నది పరిసర ప్రాంతాలకు వెళ్లకూడదని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.