
తెలంగాణను వర్షాలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలన్నీ దాదాపు జలదిగ్బంధం అయిపోయాయి. భారీ వరదలతో రోడ్లు, గ్రామాలు, రైల్వే ట్రాక్ లు అన్నీ ధ్వంసం అయ్యాయి. దీంతో ఎక్కడి జనం అక్కడే ఉండాల్సి వస్తోంది. కనీసం సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు కూడా దారితోచని పరిస్థితి.
గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మెదక్ జిల్లా అతలాకుతలం అయ్యింది. గురువారం (ఆగస్టు 28) హవేలీ ఘణపూర్ దగ్గర వరద ఉధృతికి బ్రిడ్జీలు తెగిపోయాయి. దీంతో రాకపోకలు బంద్ అయ్యాయి. బూరుగుపల్లి, వాడ, దూప్ సింగ్ తాండాకు వరద ప్రభావంతో రాలపోకలు నిలిచిపోయాయి.
గురువారం మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే రోహిత్ తో కలిసి మెదక్ జిల్లా పర్యటించారు. హవేలీ ఘనపూర్ పరిసర ప్రాంతాల్లో పరిస్థితులను తెలుసుకున్న ఆయన సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన ఏర్పాటు చేయాలని సూచించారు.
►ALSO READ | కామారెడ్డిలో వరద బీభత్సం..ఆనవాళ్లు లేకుండా కొట్టుకుపోయిన కోళ్ల ఫారం
మరోవైపు బ్రిడ్జీలు తెగిపోవడంతో వాగులు భయానకంగా ప్రవహిస్తున్నాయి. వరి పొలాలు పూర్తి స్థాయిలో నేలమట్టం అయ్యాయి. వరద ఎఫెక్ట్ తో ఎక్కడికక్కడ కరెంటు స్తంభాలు విరిగి పడ్డాయి. పంట పొలాల్లో ట్రాన్స్ఫర్స్, స్తంబాల వైర్లు పడిపోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
ఇండ్లు కూలితే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం: మంత్రి వివేక్
వరద ముంపు ప్రాంతాల్లో మంత్రి వివేక్ వెంకటస్వామి, స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, కాంగ్రెస్ సీనియర్ నేత మైనంపల్లి హనుమంతరావుతో కలిసి పర్యటించారు. రామాయంపేట పరిసర ప్రాంతాలు పూర్తి స్థాయిలో మునిగి పోయాయని అన్నారు మంత్రి వివేక్. రాష్ట్ర ప్రభుత్వం ముంపుకు గురైన అన్ని ప్రాంతాలనును ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. మారమ్మతులకు కావాల్సిన వాటికి ఎస్టిమేట్ చేసి నిధులు ఇస్తామని తెలిపారు.
వర్షాలు, వరదలకు పంట నష్టపోయిన వారికి పరిహారం చెల్లిస్తామని చెప్పారు మంత్రి వివేక్. కూలిన ఇండ్లకు మరమ్మతులు చేయిస్తామని చెప్పారు. ఒకవేళ పూర్తి కూలితే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. రామాయంపేట, హవేలీ ఘనపూర్ చుట్టుపక్కల ప్రాంతాల వారు జాగ్రత్త గా ఉండాలని సూచించారు.